24-కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!
వందేభారత్ ప్రయాణీకులకు రైల్వే శాఖ సూపర్ న్యూస్ చెప్పింది. వందేభారత్ స్లీపర్ రైళ్లను 24 కోచ్ లతో పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో.. ఏపీ, తెలంగాణ మీదుగా వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభం పై కసరత్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రెండు రైళ్ల కేటాయింపు ఖాయమైంది. రూట్.. షెడ్యూల్ ఫిక్స్ చేసారు.
వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పై తుది కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా చెన్నైలో ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ద్వారా ఏకంగా 50 స్వదేశీ వందే భారత్ స్లీపర్ రైలుసెట్లను ఉత్పత్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా ఉన్న 16-కోచ్‌ల స్లీపర్ రైళ్లతో పోలిస్తే, కొత్తగా రాబోయే రైలుసెట్లలో 24 కోచ్‌లు ఉండనున్నాయి. దీనివల్ల ప్రయాణికుల సామర్థ్యం సుమారు 1.5 రెట్లు పెరుగుతుంది. 24-కోచ్‌ల స్లీపర్ రైలుసెట్‌ల నిర్మాణ డిజైన్‌లు మరియు అండర్‌ఫ్రేమ్ ప్రొడక్షన్ డ్రాయింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిల్లో 17 ఏసీ 3-టైర్ (AC 3-Tier) కోచ్‌లు, 5 ఏసీ 2-టైర్ (AC 2-Tier) కోచ్‌లు, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ (AC First Class) కోచ్ తో పాటుగా 1 ప్యాంట్రీ కార్ ఉండనున్నాయి.

రైల్వే శాఖ తాజా కసరత్తు
అదే విధంగా ప్రస్తుతం ఉన్న అమృత్ భారత్ రైళ్లలో కేవలం జనరల్, నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు మాత్రమే ఉండగా, అమృత్ భారత్ 3.0 వేరియంట్‌లో నాన్-ఏసీ కోచ్‌లతో పాటు ప్రత్యేకంగా ఏసీ కోచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్ల ను దసరా వేళ ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విశాఖ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. కాగా.. విశాఖ నుంచి బెంగళూరు వందేభారత్ స్లీపర్ షెడ్యూల్ ఫిక్స్ చేసారు.ఈ రైలు సోమవారం మినహా మిగిలిన రోజుల్లో నడవనుంది. విశాఖ నుంచి రాత్రి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి దువ్వాడకు 8.45కు, కృష్ణాకెనాల్‌కు అర్ధరాత్రి 1.05కు, నంద్యాలకు తెల్లవారుజామున 4.40కి, ధర్మవరానికి 7.30కి, బెంగళూరుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8 గంటలకు బయలుదేరి ధర్మవరానికి 10.30కి, నంద్యాలకు అర్ధరాత్రి 1.02కి, కృష్ణా కెనాల్‌కు తెల్లవారుజాము 4.55కు, దువ్వాడకు 9.15కు, విశాఖపట్నాని కి ఉదయం 10 గంటలకు చేరుకోనుంది.












Click it and Unblock the Notifications