ద్రోణి ఎఫెక్ట్: ఏపీలో ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు; ఐఎండీ వార్నింగ్!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరిన్ తీరంతో పాటు దానికి అనుకుని దక్షిణ తమిళనాడు పరిసరాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే లక్షద్వీప్ కొరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలోను, రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
ఏపీ, తెలంగాణాకు వాన గండం
వచ్చే వారం రోజులపాటు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా నేడు తెలంగాణలోనూ, కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండి సూచించింది.

నేడు ఈ ప్రాంతాలలో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం పూట కోస్తాంధ్రలో వర్షం పడే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కల్వకుర్తి, దేవరకొండ దగ్గర వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 9 గంటల తర్వాత దక్షిణ, పశ్చిమ రాయలసీమలో వర్షం పడే అవకాశం ఉందని శాటిలైట్ వర్షపాత అంచనాలను బట్టి తెలుస్తుంది.
ఈ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ద్రోణి ఎఫెక్ట్ కూడా కొనసాగుతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ జిల్లాలలోనూ వర్షాలకు చాన్స్
అంతేకాదు ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలలో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా వెల్లడించింది. ఇదిలా ఉంటే నిన్న రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి.
నిన్న రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాక నెల్లూరు జిల్లా ఓలేటి పాలెంలో 48.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొలం పనులు చేసుకునే రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం పలు సూచనలు చేసింది.












Click it and Unblock the Notifications