బెజవాడలో వర్ష బీభత్సం-విరిగిపడ్డ కొండచరియలు-ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటు..
ఏపీలో భారీ వర్షాల ప్రభావం కొనసాగుతోంది. విజయవాడలోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరానికి చుట్టు పక్కల ఉన్న నదులు,వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోనూ భారీ వర్షం కారణంగా పలు రహదారులు ముంపుకు గురయ్యాయి. అలాగే కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇళ్లు కూలి ఓ వ్యక్తి మృతిచెందినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ కు కృష్ణానది వరద పోటు పెరుగుతోంది.
భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలం అవుతోంది. కొన్ని రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న జనం భయంభయంగా గడుపుతున్నారు. రోడ్లపైనే భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

విజయవాడ కస్తూరిబాయ్ పేటలో ఇంటిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వానల వల్ల ఈ కొండ చరియలు విరిగిపడ్డాయి. అలాగే ప్రస్తుతం నిరంతరాయంగా వర్షం కురుస్తుండటంతో మరిన్ని కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టకపోవడంపై కొండలపై నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మున్నేరు, బుడమేరు,పాలేరు వాగుల నుంచి కృష్ణా నదికు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజ్ 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తి అధికారులు నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 51 వేల940 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో నది తీర దిగువ ప్రాంతంలో నివసించే వారిని రెవిన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications