హిందూపురంలో శవం: తండ్రిని కిడ్నాప్ చేసి చంపేసి కూతురి డ్రామా
బెంగళూరు: తన పేరుతో ఆస్తి వ్రాసివ్వలేదని కక్ష పెంచుకున్న కుమార్తె స్నేహితులతో కలిసి కన్నతండ్రిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలో సంచలనం కలిగించింది. తండ్రి హత్యకు కారణం అయిన కుమార్తె, ఆమె స్నేహితులు కటకటాలపాలైనారు.
భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ (బీఇఎల్) లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన రాజారామ్ (73) బెంగళూరులోని విద్యారణ్యపురలో నివాసం ఉంటున్నారు. ఈయన కుమార్తె మధుమతి. రాజారామ్ కుమార్తె మధుమతికి బిళేకహళ్ళి ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ తీసిచ్చారు.
విద్యారణ్యపురలోని సొంత ఇంటిలో రాజారామ్ నివాసం ఉంటున్నారు. విద్యారణ్యపురలో ఉన్న ఆస్తిని తన పేరుతో వ్రాసివ్వాలని మధుమతి తండ్రి మీద ఒత్తిడి తీసుకు వచ్చింది. ఆస్తి వ్రాసివ్వడానికి రాజారామ్ అంగీకరించలేదు.

ఈ విషయంలో మధుమతి తండ్రి మీద కక్ష పెంచుకుంది. నవంబర్ 11వ తేదిన వాకింగ్ వెళ్లిన రాజారామ్ ను మధుమతి ఆమె స్నేహితులు కారులో కిడ్నాప్ చేశారు. తరువాత ఆయనను హత్య చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం దగ్గరకు వెళ్లారు.
హిందూపురం సమీపంలోని నిర్జనప్రదేశంలో శవం కాల్చివెయ్యడానికి ప్రయత్నించారు. తరువాత బెంగళూరు వచ్చిన మధుమతి తన తండ్రి వాకింగ్ కు వెళ్లి తిరిగి రాలేదని విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నవంబర్ 18వ తేదిన హిందూపురం పోలీసులు రాజారామ్ మృతదేహాన్ని గుర్తించారు. అప్పటి నుంచి మధుమతి అదృశ్యం అయ్యింది. పోలీసులు గాలించి మధుమతిని, రాజారామ్ ను హత్య చెయ్యడానికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
ఆస్తి కోసం తన తండ్రిని స్నేహితులతో కలిసి హత్య చేశానని విచారణలో మధుమతి అంగీకరించిందని విద్యారణ్య పుర పోలీసులు తెలిపారు. రాజారామ్ చాల సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడ్డారు.












Click it and Unblock the Notifications