రామ్ చరణ్ ఇంటి ముట్టడికి అల్టిమేటం!
సినీ నటుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి దీక్షలో ఉండి దర్గాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారం ముదిరి తెలుగు రాష్ట్రాలలో రచ్చగా మారింది. అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు, అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని రామ్ చరణ్ పైన తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ఆరోపించింది.
అయ్యప్ప దీక్షలో దర్గాకు వెళ్ళిన ఘటనపై రామ్ చరణ్ వివరణ ఇవ్వాలి
మాల ధారణ చేసి, దీక్షలో ఉండి దర్గాకు ఎలా వెళ్లారని తెలంగాణ అయ్యప్పల ఐక్యవేదిక రామ్ చరణ్ ను ప్రశ్నించింది. అంతేకాదు హిందువులకు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన వారికి నియమ నిష్టలు ఉంటాయని పేర్కొన్న అయ్యప్ప జేఏసీ దర్గా లోపలికి వెళ్ళినప్పుడు ఆయన బొట్టును తుడిచారని, ఈ సంఘటన పైన రామ్ చరణ్ వివరణ ఇవ్వాలని అన్నారు.

పవన్ సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తుంటే మీ మాటేంటి?
మాల ధారణ చేసిన వారు ఏదైనా అశుభం జరిగినప్పుడు మాత్రమే మాల, బొట్టు తీస్తారని అయ్యప్ప జేఏసీ స్వాములు పేర్కొన్నారు. రామ్ చరణ్ కు అయ్యప్ప మాల వేసిన గురుస్వామి ఆయనకు అయ్యప్ప దీక్ష విషయంలో జ్ఞానోదయం కల్పించాలని పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే, బాబాయ్ బాటలో నడవాల్సిన రామ్ చరణ్ అందుకు భిన్నంగా అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లారని వారు అన్నారు.
రామ్ చరణ్ ఇంటి ముట్టడికి అల్టిమేటం
ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మొత్తం హిందూ సమాజానికి బాధను కలిగించిందన్నారు. సనాతన ధర్మాన్ని హిందువులను, అయ్యప్పలను అవమానిస్తే సహించేది లేదన్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రెహమాన్ పై ఆరోపణలు.. రామ్ చరణ్ కు సూటిప్రశ్న
దర్గాకు వచ్చేవారు తక్కువ అయ్యారని ఏఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగా రామ్ చరణ్ ను దర్గాకు వెళ్ళమన్నారని వారు ఆరోపించారు. అదే రెహమాన్ ని కూడా శబరిమలకు నిష్టగా మాల వేసుకుని రాంచరణ్ తీసుకు రాగలరా అంటూ ప్రశ్నించారు. అయ్యప్ప మాల వేసుకుని దర్గాకు వెళ్లి హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన అయ్యప్ప ఆగ్రహానికి గురికాక తప్పదని వారన్నారు.












Click it and Unblock the Notifications