అది ఎర్ర బుక్కా, ఎర్రి బుక్కా?
Vyuham: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని రెండు భాగాలుగా తెరకెక్కింది సినిమా. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. ఈ నెల 29వ తేదీన ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషించాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటించారు. ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సహా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌పై రామ్ గోపాల్ వర్మ విమర్శలు సంధించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను గుర్తు చేసి మరీ సెటైర్లు వేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు ఆర్జీవీ. పవన్ కంటే బర్రెలక్క ఎన్నోరెట్లు బెటర్ అంటూ తేల్చి పడేశారు.
పాదయాత్ర సమయంలో నారా లోకేష్ పట్టుకు తిరిగిన ఎర్ర బుక్‌పై రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. అది ఎర్ర బుక్కా, ఎర్రి బుక్కా అర్థం కావట్లేదని అన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సేవ చేయాలనుకునే నాయకుడెవరూ కూడా ఇలా ఎర్ర బుక్కుల్లో పేర్లు రాసి, వారిపై ప్రతీకారాన్ని తీర్చుకుంటామని అనుకోరని చెప్పారు. ఇలా కిమ్ జొంగ్ ఉన్ కూడా చేసి ఉండడని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఓ రంగుల రాజాలా తయారయ్యాడని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. తోలు తీస్తానని, దవడ పగులగొడతానని, బట్టలు విప్పి కొడతానంటూ హెచ్చరించడం రాజకీయం అనిపించుకోదని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ వంటి నాయకుల నిజ స్వరూపం ఎలా ఉంటుంది? వారి ఆలోచనలు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించానని చెప్పారు.












Click it and Unblock the Notifications