ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టు పై కీలక నిర్ణయం..!!
ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టు మరోసారి తెర మీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ గా రామకృష్ణారెడ్డిని మరోసారి నియమించింది. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడేళ్లపాటు ఎంఆర్‌సీఎండీగా కొనసాగనున్నారు. రామకృష్ణా రెడ్డి గతంలోనూ ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఎండీగా పనిచేస్తున్న జయమన్మథరావును రిలీవ్ చేసారు.
రెండు నగరాల్లో
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సి ఉంది. దానికి గానూ ఒక ఏడాది గడువు విధిస్తూ చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2015 అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థగా ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ అభివృద్ధి లక్ష్యం. ఆ తర్వాత విజయవాడ మెట్రోని అమరావతి వరకూ పొడిగించాలని ప్రతిపాదన సిద్ధం చేశారు.

నాటి మెట్రో ప్రతిపాదనలు
2014-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ మెట్రో రైలు ప్రతిపాదనను పట్టాలెక్కించారు. రెండుకారిడార్లలో మెట్రోరైలు నిర్మాణానికి ప్రతిపాదనలు, డీపీఆర్‌లు తయారు చేశారు. మొదటి కారిడార్ మహాత్మాగాంధీ రోడ్ ద్వారా వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వరకు, రెండవది బీఆర్‌టీఎస్ రోడ్, రైల్వేస్టేషన్ నుంచి రామవర్పాడు రింగ్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు నిర్మించాలని ప్రతిపాదించారు. ఎండీగా ఉన్న ఎన్ పీ రామకృష్ణారెడ్డి సారథ్యంలో అమరావతి మెట్రో కోసమంటూ దిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అధికారి శ్రీధరన్ తో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. డీపీఆర్ కూడా సిద్ధం చేసి కేంద్రానికి ప్రతిపాదించారు.
మెట్రోకు ఎండీ నియామకం
కానీ దానిని కేంద్రం తిరస్కరించింది. లైట్ మెట్రో ప్రాజెక్ట్ పేరుతో చేసిన ప్రయత్నం ముందుకు సాగలేదు. కొరియా, మలేసియా సంస్థల సహకారం తీసుకుని ముందుకు సాగుతామని ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతో అది ముందుకు సాగలేదు. తదుపరి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(వీఎంఆర్డీయే) పరిధిలో మెట్రో ప్రాజెక్ట్ తో పాటుగా విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టు కోసం ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీఎంఆర్సీఎల్) పనిచేస్తుందని ప్రకటించారు. తిరిగి, ఇప్పుడు తాజా నియామకంతో ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications