ఓసారి గెలిచి మళ్లీ ఓడిన రామానాయుడు: రాజకీయాలపై అసంతృప్తి
హైదరాబాద్: మూవీ మొఘల్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ నిర్మాత డాక్టర్ డీ రామానాయుడు బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో హిట్ నిర్మాతగా టాప్ పొజిషన్లో ఉన్న రామానాయుడు రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారని చెప్పవచ్చు.
13వ లోకసభలో ఆయన గుంటూరి జిల్లాలోని బాపట్ల లోకసభ స్థానం నుండి పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున 1999లో పోటీ చేసి గెలుపొందారు. 1999 నుండి 2004 వరకు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. అనంతరం 2004లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.
రామానాయుడు ఎంపీగా ఉన్న సమయంలో తన నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశాడనే పేరు తెచ్చుకున్నారు. అయితే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. అభివృద్ధి చేసినప్పటికీ గెలిపించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2003లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాదులో చిత్రసీమ స్థిరపడడానికి రామానాయుడు కృషి చేశారు. విశాఖలో కూడా స్టూడియోను నిర్మించాలనుకున్నారు.

నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్‌ల సంతాపం
రామానాయుడు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశఖర రావు, గవర్నర్ నరసింహన్ తదితరులు సంతాపం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కు కోల్పోయిందని చంద్రబాబు సంతాపం తెలిపారు.
శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారని, చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తెచ్చందుకు ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మృతి యావత్ సినీ ప్రపంచానికి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం రామానాయుడిది అని వైయస్ జగన్ అన్నారు. ఆయన తెలుగు చలన చిత్ర నిర్మాణ రంగంలోనే అగ్రగణ్యుడన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు వివిద భాషల్లో వందకు పైగా చిత్రాలు నిర్మించి, గిన్నిస్ రికార్డ్ సాధించిన ఘనత ఆయనదే అన్నారు. మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. రామానాయుడు మరణం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications