విగ్రహాల విధ్వంసంపై జగన్ కౌంటర్ అటాక్: టీడీపీ ప్రమేయంపై పక్కా స్కెచ్: గవర్నర్‌తో భేటీ
అమరావతి: రాష్ట్రంలో దేవతా విగ్రహాల విధ్వంస ఘటనలు ఒకదాని వెంట ఒకటిగా కొనసాగుతోన్న వేళ.. రాజకీయ ప్రత్యర్థుల విమర్శల జడివానతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్‌భవన్ గడప తొక్కబోతోన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 5:30 గంటలకు ఆయన గవర్నర్‌తో భేటీ కానున్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలపడానికే ఆయన గవర్నర్‌ను కలుస్తున్నారని సమాచారం ఉన్నప్పటికీ.. విగ్రహాల విధ్వంసం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీ ఏర్పాటు కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది.
భయంకరమైన శిక్ష: రామతీర్థం ఉదంతంపై జగన్ సర్కార్‌కు చిల్కూర్ బాలాజీ అర్చకుల అల్టిమేటం

గవర్నర్‌కు కీలక నివేదిక..
విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతోన్న ఉదంతాలపై వైఎస్ జగన్.. రాజకీయంగా తన ఎదురుదాడిని ఆరంభించారని, ఇందులో భాగంగానే ఆయన గవర్నర్‌ను కలుసుకోనున్నారని అంటున్నారు. విగ్రహాల విధ్వంసం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకుని రావడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తోన్న ప్రయత్నాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది. దీనిపై ఓ నివేదికను ఆయన గవర్నర్‌కు అప్పగిస్తారని సమాచారం.

పోలీస్ డ్యూటీ మీట్ స్పీచ్‌లో అంశాలు..
ఈ నివేదికలో పొందుపరిచిన కొన్ని ముఖ్యాంశాలనే వైఎస్ జగన్.. తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి సరిగ్గా ఒకటి, రెండు రోజుల ముందే విగ్రహాలపై దాడులకు చోటు చేసుకుంటున్నాయనే అంశాన్ని ఆయన గవర్నర్‌కు వివరించబోతోన్నారని అంటున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఆందోళనతో ప్రతిపక్ష పార్టీ నాయకులు విగ్రహాల విధ్వంసానికి పూనుకుంటున్నారని, ప్రజల దృష్టిని మరల్చడానికి కుట్ర పన్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి.. గవర్నర్‌కు వివరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సంక్షేమ పథకాల ప్రారంభ తేదీతో సహా..
సంక్షేమ పథకాలను ఎప్పుడు ప్రారంభిస్తారనే తేదీలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించిందని, దానికి అనుగుణంగా విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని వైఎస్ జగన్ భావిస్తున్నారని అంటున్నారు. 2019 నవంబర్ 14వ తేదీన మనబడి నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించినప్పటి నుంచి.. మొన్నటి ఇళ్ల పట్టాల పంపిణీ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు , వాటిని ప్రారంభించే సమయంలోనే దేవతా మూర్తుల విగ్రహాలపై దాడులు చోటు చేసుకున్న విషయాన్ని తేదీలతో సహా అధికారులు ఓ నివేదికను రూపొందించారని, దాన్ని గవర్నర్‌కు అందజేస్తారని తెలుస్తోంది.

అశోక్ గజపతి రాజు ధర్మకర్తగా..
ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం.. దానికి ముందు లేదా వెనుక విగ్రహాల ధ్వంసం చోటు చేసుకోవడం.. ఇదంతా ఒక్క పక్కా పథకం ప్రకారమే సంభవించిందనడానికి అవసరమైన సాక్ష్యాధారాలను గవర్నర్‌కు అందజేస్తారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆధీనంలో ఉన్న ఆలయాల్లోనూ దాడులు చోటు చేసుకుంటున్నాయని, దీనికి రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని సాక్ష్యంగా చూపించబోతోన్నారని చెబుతున్నారు. రామతీర్థం ఆలయానికి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు ధర్మకర్తగా వ్యవహరించిన విషయాన్ని వైఎస్ జగన్ గవర్నర్‌కు దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.