విజయవాడ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మక పోరు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. విజయవాడ నడిబొడ్డున వైసీపీ, టీడీపీ -జనసేన మధ్య రాజకీయ పోరు హోరా హోరీగా మారుతోంది. విజయవాడ నగరంలో తూర్పూ నియోజకవర్గం లో టీడీపీ, వైసీపీ అభ్యర్దులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు అభ్యర్దులు ఎత్తులు, వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
హోరా హోరీ : విజయవాడ తూర్పులో ఈ సారి పోరు హోరీ హోరీగా మారుతోంది. ఇక్కడ 1984 లో ఎన్టీఆర్ పై తిరుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కరరావు ఇదే నియోజక వర్గం నుండి 1978 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 లో బిజెపి నుండి సినీ నటుడు కోట శ్రీనివాసరావు పోటీ చేసి ఇదే నియోకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసిన యలమంచిలి రవి రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలను ఓడించారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని రాజశేఖర్ కాంగ్రెస్ నుండి పోటీ చేసారు. టిడిపి నుండి సీనియర్ నేత గద్దే రామ్మోహన్ బరిలో నిలిచారు. ఆ ఇద్దరి మీదా ప్రజారాజ్యం అభ్యర్ది గెలుపొందారు.

విజయం దక్కేదెవరికి : 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది గద్దే రామ్మోహన్ ఇక్కడ వరుసగా 15 వేల పైగా మెజార్టీతో విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా పైన.. 2019లో బొప్పన రవికుమార్ పైన రామ్మోహన్ గెలుపొందారు. ఇప్పుడు ఎన్నికల్లో రామ్మోహన్ మరోసారి టీడీపీ అభ్యర్దిగా పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో అవినాశ్ వైసీపీ నుంచి గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరిన అవినాశ్ చాలా కాలంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరటం తో ఇద్దరూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
గెలుపు దక్కేదెవరికి : గద్దే రామ్మోహన్ ఈ సారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది అవినాశ్ లక్ష్యంగా ఉంది. విజయవాడ నగరంలో కీలకమైనదిగా చెప్పుకొనే ఇక్కడ గెలుపు రెండు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సామాజిక సమీకరణాలు ఇక్కడ అభ్యర్దుల గెలుపు ఓటమలను ప్రభావితం చేయనుంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావటం..స్థానికంగా వ్యక్తిగతంగా ఉన్న బంధుత్వం ఇద్దరికీ కలిసి రానుంది. దీంతో..ఇక్కడ ఎవరికి గెలుపు దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications