ఏపీ, టీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ జిల్లాలో ఎన్ని..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. ఏపీలో తూర్పు గోదావరి, తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 14 నియోజకవర్గాలు ఉండగా23కు, తూగోలో 19 ఉండగా 23కు పెరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 175 నియోజకవర్గాలు ఉండగా... అవి 225కు, తెలంగాణలో 119 ఉండగా, 153కు పెరగనున్నాయి. లోకసభ నియోకవర్గాలు మాత్రం ఇప్పుడు ఉన్నట్లుగానే ఉండనున్నాయని తెలుస్తోంది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలు 36 నుండి 50కి, తెలంగాణలో 31 నుండి 38కి పెరగనున్నాయి. ఏపీలో ఎస్సీలకు 38, ఎస్టీలకు 12, తెలంగాణలో ఎస్సీలకు 24, ఎస్టీలకు 14 సీట్లు కేటాయించే అవకాశముంది.

పునర్విభజనలో రెండు రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెరిగే నియోజకవర్గాలు ఇలా ఉండే అవకాశముంది...
తెలంగాణలో..
అదిలాబాద్ 10 నుండి 12కు, నిజామాబాద్ 9 నుండి 11కు, కరీంనగర్ 13 నుండి 17కు, మెదక్ 10 నుండి 13కు, రంగారెడ్డి 14 నుండి 23కు, హైదరాబాద్ 15 నుండి 17కు, మహబూబ్ నగర్ 14 నుండి 18కి, నల్గొండ 12 నుండి 15కు, వరంగల్ 12 నుండి 15కు, ఖమ్మం 10 నుండి 12కు పెరిగే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్‌లో..
శ్రీకాకుళం 10 నుండి 12కు, విజయనగరం 9 నుండి 11కు, విశాఖపట్నం 15 నుండి 20కి, తూర్పు గోదావరి 19 నుండి 23కు, పశ్చిమ గోదావరి 15 నుండి 18కు, కృష్ణా 16 నుండి 21కి, గుంటూరు 17 నుండి 22కు, ప్రకాశం 12 నుండి 15కు, ఎస్పీఎస్ నెల్లూరు 10 నుండి 14కు, కడప 10 నుండి 13కు, కర్నూలు 14 నుండి 18కి, అనంతపురం 14 నుండి 19కి, చిత్తూరు 14 నుండి 19కి పెరిగే అవకాశముంది.












Click it and Unblock the Notifications