ఏపీలో దారుణం.. మూడేళ్ల బాలికపై హత్యాచారం.. ఎక్కడంటే ?
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల కామానికి స్త్రీలు బలి అవుతూనే ఉంటున్నారు. ఇప్పుడు కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో కూడా హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. ఓ మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని పట్టుకున్న గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ అనూహ్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు, తమ మూడేళ్ల కూతురితో కలిసి బంధువుల పెళ్లికి కంబాలదిన్నెకు వెళ్లారు. వేడుక జరుగుతున్న సమయంలో చిన్నారి పెళ్లి మండపం బయట ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అరటి పండు ఇస్తానని ఆశ చూపించి ఆమెను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. హత్య చేశాడు.

అయితే చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించగా.. చివరికి ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా.. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వెల్లడించారు. అభం శుభం తెలియని చిన్నారిని బలితీసుకున్న కిరాతకుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications