Video: బాబోయ్.. ఎంత పెద్ద నల్ల నాగు ! ఉలిక్కిపడ్డ భక్తులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఒక్కసారిగా ఓ అరుదైన నల్లనాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయ దర్శన కౌంటర్ సమీపంలో నల్లనాగు బుసలు కొడుతూ సంచరించడాన్ని గమనించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక, ప్రాణభయంతో అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ఆలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది.
పరిస్థితిని గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఆలయ పరిసరాల్లో ఉన్న పాములు పట్టే నిపుణుడు మోహన్‌కు తక్షణమే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్.. ఎంతో చాకచక్యంగా, శ్రమించి ఆ నల్లనాగును పట్టుకున్నారు. పాము సురక్షితంగా చిక్కడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత దానిని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

మహానంది క్షేత్రం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో అప్పుడప్పుడు పాములు, ఇతర వన్యప్రాణులు ఆలయ పరిసరాల్లోకి రావడం సహజమేనని స్థానికులు చెబుతున్నారు. అయితే, ప్రతిరోజూ వందలాది మంది భక్తులు సంచరించే ప్రధాన దర్శన కౌంటర్ వద్దకే నల్లనాగు రావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. "ఆ పరమశివుని అనుగ్రహంతో భక్తులెవరికీ ఎలాంటి హానీ జరగలేదు.. ఒక్క క్షణం ఆలస్యమైనా పరిస్థితి ప్రమాదకరంగా మారేది" అని దర్శనానికి వచ్చిన భక్తులు వ్యాఖ్యానించారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భక్తుల విజ్ఞప్తి
ఈ ఘటన నేపథ్యంలో ఆలయ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోజూ వేలాది మంది వచ్చే పుణ్యక్షేత్రం కావడంతో క్షేత్ర పరిసరాలను, ప్రత్యేకించి భక్తుల రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. పాములు సంచరించే అవకాశం ఉన్న పొదలు, శిథిల ప్రదేశాలను పరిశీలించి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దర్శనానికి వచ్చి అనుకోకుండా నల్లనాగును చూడటంతో భక్తుల్లో ఒకవైపు భయం, మరోవైపు శివుని వాహనమైన నాగేంద్రుని దర్శన భాగ్యం కలిగిందనే భావన వ్యక్తమయ్యాయి.














Click it and Unblock the Notifications