తిరుమలలో నెవ్వర్ బిఫోర్..
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సూర్యజయంతి సందర్భంగా సప్తవాహనాలపై ఊరేగారు శ్రీవారు. భక్తులను కరుణించారు. సప్తాశ్వరూఢుడైన శ్రీవారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
మంగళవారం తెల్లవారు జామున సూర్యప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున తిరుమల ఆనంద నిలయం వాయువ్య దిశలో ఉన్న మేదరమిట్ట మూలలో తొలుత సూర్యప్రభ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సరిగ్గా 6:38 నిమిషాలకు సూర్య కిరణాలు వాహనాన్ని తాకాయి. దీనితో ఒక్కసారిగా గోవిందుడి నామస్మరణతో తిరుమలగిరులు మార్మోగిపోయాయి.

ఆ వెంటనే అర్చకులు మలయప్ప స్వామివారికి ప్రత్యేకంగా హారతి ఇచ్చారు. నివేదనను సమర్పించారు. తిరిగి వాహనసేవ ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు చిన్నశేషవాహన సేవ, 11 గంటలకు గరుడవాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 2 వరకు- హనుమంత వాహనం, 2 నుండి 3 గంటల వరకు- చక్రస్నానం నిర్వహించారు అర్చకులు.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు- కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. ఒకే రోజున ఏడు వాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగే పర్వదినం కావడం వల్ల రథ సప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవంగా భావిస్తుంటారు భక్తులు.
అందుకే- దేశవ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. కనులారా శ్రీవారి వైభవాన్ని వీక్షించారు. తిరుమలలో రధసప్తమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సప్తవాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
తెల్లవారుజాము నుంచే నాలుగు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు వారికి అన్నప్రసాదం, మంచనీరు, మజ్జిగ, సుండల్, బిస్కెట్లు.. పంపిణీ చేశారు. వారికి నీడను కల్పించడానికి టీటీడీ అధికారులు జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు.
కల్పవృక్ష వాహనం ముగిసిన తరువాత టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, కొంతమంది బోర్డు సభ్యులు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ ఇన్‌ఛార్జ్ మణికంఠ.. గ్యాలరీలను సందర్శించారు. భక్తులతో మాట్లాడారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
టీటీడీ ఏర్పాట్లపై ఈ సందర్భంగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. నెవ్వర్ బిఫోర్.. అంటూ ప్రశంసించారు. భక్తులకు కల్పించిన వసతి, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ బాగున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. టీటీడీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, తిరుపతి జిల్లా పోలీసులు, శ్రీవారి సేవకుల సమన్వయంతో రథ సప్తమి వేడుకలను విజయవంతం చేశామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications