Rathasaptami: తిరుమల కిటకిట, ఓకే రోజు ఏడు వాహనాల్లో శ్రీవారి దివ్య దర్శనం..!!
Tirumala: రథసప్తమి వేళ తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సన్నిధిలో ఈ రోజు సూర్య జయంతి (రథసప్తమి) పర్వదినం ఘనంగా జరుగుతోంది. బ్రహ్మోత్సవంలా జరిగే అపురూప సందర్భం. శ్రీ మలయప్ప స్వామి వారు (కోనేటిరాయుడు) ఏడు విభిన్న వాహనాలపై (సప్త వాహన సేవలు) తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ రథసప్తమి వేడుకలు కొనసాగుతున్నాయి.
తిరుమలలో రథసప్తమి ఒక చిన్న బ్రహ్మోత్సవంలా జరిగే అపురూప సందర్భం. స్వామి వారి దర్శనం కోసం నిన్న సాయంత్రం నుంచే భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు భక్తులకు అన్నప్రసాదం, పానీయాలు పంపిణీ చేస్తున్నారు. గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి సేవలు ప్రారంభమయ్యాయి. సూర్యోదయ సమయంలో సూర్యప్రభపై శ్రీవారిని దర్శించడం భక్తులకు అద్భుత అనుభూతిని కలిగించింది. తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హంస వాహనం, ఆశ్వ వాహనం, గజ వాహనం వంటి వాహనాలపై స్వామి వారు ఈ రోజు ఊరేగుతారు. రాత్రి 8:00 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఈ దివ్య వాహన సేవలు ముగుస్తాయి. ఈ వేడుక నేపథ్యంలో ఆలయ మహద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు వర్ణరంజిత పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇందుకు పది టన్నుల సంప్రదాయ పువ్వులు వినియోగించారు.

పెరిగిన భక్తుల రద్దీ
స్వామివారు విహరించనున్న తిరువీధుల్లో సకల ఏర్పాట్లూ చేపట్టారు. మూలమూర్తికి తెల్లవారు జామున నిత్యకైంకర్యాలు పూర్తయ్యాక ఉదయం 5.30 గంటలకు మలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడ విశేష సమర్పణ అనంతరం సూర్యోదయానికి ముందే సర్కారు హారతితో వాహనసేవ ప్రారంభమైంది. ఉప బ్రహ్మోత్సవాలుగా పిలిచే ఈ వేడుకలో ఒకేరోజు స్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై విహరిస్తారు. ఉదయత్పూర్వం సూర్యప్రభ సేవతో మొదలై రాత్రి చంద్రప్రభ సేవతో వాహనసేవలు ముగుస్తాయి. రథసప్తమి వేళ అరసవల్లి సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. స్వామివారికి మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాలు రెండు రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని వివరించారు. వైభవంగా రథసప్తమి శోభాయాత్ర జరిగింది.












Click it and Unblock the Notifications