అర్థం లేని ప్రతిపాదనలు, అలుసుగా మారింది: సిఎం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు అర్థం లేని డిమాండ్లు చేయడం పార్టీ అధిష్టానానికి అలుసుగా మారిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న వెంటనే గురువారం రాత్రి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆయన వారి వద్ద కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
'అధిష్ఠానం మనల్ని బుల్డోజ్ చేసుకుంటూ పోతోంది. వాళ్లు అనుకున్నట్లుగా వెళుతున్నారు' అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోందంటూ శుక్రవారంనాడు వార్తలు వచ్చాయి. విభజనపై సీమాంధ్ర నేతల్లో ఐక్యత లేకపోవడం వల్ల అధిష్ఠానం వద్ద తాము చులకనయ్యామని, ఇవ్వరని తెలిసీ రాయల తెలంగాణ అడిగారని, ఇటువంటివి అడగడం వారికి అలుసుగా మారిందని కిరణ్ రెడ్డి అన్నట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.

కేబినెట్ సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావులకు ఫోన్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి రాయల తెలంగాణ ప్రతిపాదనను అంగీకరించవద్దని కోరినట్లు సమాచారం. కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు నేడు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం సమావేశం కానున్నారు.
శుక్రవారం నాటి సమావేశానికి హాజరుకావల్సిందిగా గురువారం రాత్రే అందరికీ సమాచారం అందించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం రావడానికి ముందు పలువురు మంత్రులు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. మంత్రులు సాకే శైలజానాథ్, తోట నరసింహం, టిజి వెంకటేశ్, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications