మేం గుంటూరు అంటే సీఎం విశాఖ అంటారేం: బాబుపై రాయపాటి అసహనం
విజయవాడ: టిడిపి నేత, పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు గురువారం నాడు పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన అసహనం వ్యక్తం చేశారు. తాము గుంటూరుకు రైల్వే జోన్ అడుగుతుంటే, చంద్రబాబు కూడా విశాఖకే అంటున్నారని వ్యాఖ్యానించారు.
రాయపాటి మాట్లాడుతూ... గుంటూరుకు రైల్వే జోన్ అడుగుతున్నామన్నారు. రాజధానికి దగ్గరగా రైల్వే జోన్ ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖకే రైల్వే జోన్ అంటున్నారన్నారు. విశాఖకు రైల్వే జోన్‌కు తాము వ్యతిరేకమని చెప్పారు.

తిరుపతి మెగా సిటీ అవుతుంది: చంద్రబాబు
భవిష్యత్తులో తిరుపతి మెగా సిటీ అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం తిరుపతి ఎస్పీజేఎన్ఎం పాఠశాలలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుపతికి ప్రపంచ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు.
అమరావతి, విశాఖ,తిరుపతి మహా నగరాలు అవుతాయన్నారు. తిరుపతి అభివృద్ధి బాధ్యత టిడిపిదే అని, తిరుమల మాదిరిగా తిరుపతి పరిశుభ్రంగా ఉండాలన్నారు. పేదల ఇంట్లో పెద్ద కొడుకులా ఉంటానని చెప్పారు. భవిష్యత్తులో చిత్తూరు జిల్లాలో నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు.
హంద్రీనీవా, గాలేరు - నగరిలను పూర్తి చేస్తామన్నారు. బాలాజీ రిజర్వాయర్ పూర్తి చేసి తిరుపతిలో నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు.
'కోడి పందేలపై కఠినంగా వ్యవహరిస్తాం'
సంక్రాంతి సందర్భంగా కోడి పందేలను నిర్వహించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. కోడి పందేల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందేలను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది.
కోడి పందేలను జరగనివ్వబోమని, ప్రభుత్వ ఆంక్షలు అతిక్రమించి పందేలు నిర్వహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వ వాంగూల్మాన్ని నమోదు చేసుకున్న కోర్టు... ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించగా.. ఏపీ ఆ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications