ఏపీ రాజధాని ఎఫెక్ట్: రాయపూడిలో ఉద్రిక్తం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణకు ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులు పలుచోట్ల రసాభాసగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన సదస్సులో పాల్గొన్న రైతులు తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సదస్సుకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. మంత్రివర్గ ఉపసంఘం తరఫున సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌కు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇంతవరకు ఎన్నో సందేహాలు, డిమాండ్లు, షరతులతో భూసమీకరణకు మండల గ్రామాలు వ్యక్తం చేస్తున్న సుముఖతను అంగీకారంగా చెబుతూ ముందుకు దూసుకుపోతున్న రాజధాని భూసమీకరణ సబ్ కమిటీకి రాయపూడిలో మాత్రం స్పీడ్ బ్రేక్ పడటం గమనార్హం. సిరులు పండే తమ భూముల ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు అంటున్నారు. భూములిచ్చేది లేదంటూ మెజార్టీ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాయపూడి గ్రామంలో శనివారం ఏర్పాటుచేసిన రైతు సదస్సుకు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల అభిప్రాయాలు కోరగా రైతుల నుండి మిశ్రమ స్పందన లభించింది. విలువైన భూములకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కృషిచేస్తానని, రాజధాని కోసం రైతులు కూడా కొంత త్యాగం చేయాలని ఆమె అన్నారు. దీంతో కొందరు రైతులు వ్యతిరేక నినాదాలు చేస్తూ కేకలు వేశారు.

రాజధాని రగడ
మరికొంతమంది కమిటీ సభ్యులు చెప్పే సమాచారం వినాలని కోరగా స్థానికులు కాని మీకు ఇక్కడేం పని అంటూ రైతులు ఎదురుదిరిగారు. దీంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. రైతులను పోలీసులు సర్దుబాటు చేస్తుండగా రైతు సదస్సుకు పోలీసుల అవసరమేంటని రాయపూడి గ్రామరైతులు ఆందోళన చేశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన ఎమ్మెల్సీ రాజకుమారి సదస్సు నుండి వెళ్లిపోయారు.

రాజధాని రగడ
అనంతరం మాజీ ఎంపీపీ మల్లెల హరీంధ్రనాథ్ చౌదరి మాట్లాడుతూ... రైతు సదస్సులా కాకుండా రాజకీయపార్టీ సమావేశంలా ఉందని దుయ్యబట్టారు. రెవెన్యూ అధికారుల పనితీరును ఎండగడుతూ స్థానిక సమస్యలను ఏకరువు పెట్టారు. దీనిపై శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ జోక్యం చేసుకుని రాజధాని భూ సమీకరణపై మాత్రమే అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. విధివిధానాలపై స్పష్టత లేకుండా వచ్చిన కమిటీకి మేం ఏమి సమాధానం చెప్పాలని మల్లెల ప్రశ్నించారు.

రాజధాని రగడ
భూసమీకరణ పూర్తికాకముందే కార్పొరేట్ సంస్థలకు టెండర్లు ఇస్తున్నారని ఆరోపిస్తూ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నామన్నారు. శ్రవణ్ కుమార్ స్పందిస్తూ... రాజధాని నిర్మాణం కోసం సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, ఎవరినీ టెండర్లకు పిలవలేదని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. మల్లెల మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చేందుకు తాము సిద్ధంగా లేమని, అలా అని భూములిచ్చేవారిని తాము అడ్డుకోమని స్పష్టం చేశారు.

రాజధాని రగడ
భూసమీకరణను వ్యతిరేకించే రైతులు లిఖితపూర్వకంగా తమ పేర్లు ఇవ్వాలని శ్రావణ్ కుమార్ కోరారు. లిఖితపూర్వకంగా పేర్లు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని మల్లెల సదస్సు నుండి వెళ్లిపోయారు. అనంతరం రాయపూడి రైతులు తమ అభిప్రాయాలను కమిటీ సభ్యుల వద్ద వెల్లడించారు. కాలారి సత్యనారాయణ అనే రైతు 25 ఎకరాలను, వంగిపురపు జాని 5 ఎకరాలను భూ సేకరణకు ఇస్తామని ముందుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజీలిస్తే తమ భూములిస్తామని కొమ్ముమూర్తి అనే రైతు తెలిపారు.












Click it and Unblock the Notifications