వైఎస్ వివేకా కేసు సాక్షి రంగన్న బాడీకి రీపోస్టుమార్టం-రీజన్ ఇదే..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఆరుగురు చనిపోవడంతో మిగతా వారిలో భయాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సైతం సీరియస్ గా తీసుకుంటోంది. గతంలో పరిటాల రవి హత్య కేసు విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ నిన్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. దీంతో పులివెందుల పోలీసులు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వివేకా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న తాజాగా చనిపోయారు. ఆయన మరణంపై భార్య అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో పోలీసులే ఆయన్ను చంపేశారంటూ ప్రచారం మొదలైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అలాగే రంగన్న బాడీకి రీపోస్టు మార్టం నిర్వహించాలంటూ ఆదేశాలు పంపింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ డాక్టర్ల సాయంతో రంగన్న మృతదేహానికి రీపోస్టు మార్టం నిర్వహించారు. అంతకు ముందు ఆయన చనిపోగానే అనుమానంతో ఓసారి పోస్టు మార్టం నిర్వహించారు. ఇందులో ఏమీ తేలకపోవడంతో మరోసారి ఇవాళ పోస్టుమార్టం చేశారు.

రంగన్న మృతదేహంపై ఏమైనా గాయాలు ఉన్నాయా అన్న అనుమానంతో ఇవాళ పోలీసులు ఇలా రీపోస్టు మార్టం చేయించినట్లు తెలుస్తోంది. శ్వాస సమస్యలతో బాధపడుతూ రంగన్న తాజాగా ఆస్పత్రిలోనే చనిపోయాడు. అయినా ఆయన భార్య మాత్రం అనుమానాలు వ్యక్తం చేయడంతో అలర్ట్ అయిన పోలీసులు పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో ఏదైనా క్లూ దొరికితే మిగతా సాక్ష్యుల్ని రక్షించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మరో సాక్షి, అప్రూవర్ గా మారిన దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై ఆరా తీయడంతో పాటు ఆయనకు భద్రత పెంచబోతోంది.












Click it and Unblock the Notifications