టీడీపీ సత్తాకు రేపు అసలు పరీక్ష..?
ఏపీలో వచ్చే ఎన్నికల కోసం సిద్ధమవుతున్న విపక్ష టీడీపీకి ఓ నియోజకవర్గం మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. గత పదేళ్లుగా వైసీపీ అడ్డాగా మారిపోయిన ఈ నియోజకవర్గాన్ని ఎలా గెలవాలో తెలియక అపసోపాలు పడుతున్న టీడీపీ ఈసారి ఏం చేయబోతోందనేది రేపు తేలిపోనుంది. ఇక్కడ టీడీపీ నిర్వహిస్తున్న రా కదలిరా సభ ద్వారా టీడీపీ ఇచ్చే సంకేతం వచ్చే ఎన్నికల్లో ఈ సీటులో ఏం జరగబోతోందనేది తేల్చనుంది.
కృష్ణాజిల్లాలో ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నియోజకవర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి సైతం తొలుత రెండుసార్లు విజయాలు అందించింది. ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరినా కొడాలి జైత్ర యాత్ర మాత్రం ఆగలేదు. ఇలా వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ వద్ద సాలిడ్ ప్లాన్ లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో ఫోకస్ పెట్టడం, ఎన్నికలయ్యాక తిరిగి నియోజకవర్గాన్ని వదిలేయడమే ఇందుకు కారణం. ఈసారి కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

కానీ ఈసారి ఎలాగైనా కొడాలి నానిని ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్న టీడీపీ ఎన్నారై వెనిగండ్ల రామును బరిలోకి దింపింది. స్వయంగా కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికే చెందిన వెనిగండ్ల రాముకు ఎస్సీ అయిన ఆయన భార్య రూపంలో మరో సానుకూలత కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీ ఓట్లను గంపగుత్తగా వేయించుకోవడంలో సక్సెస్ అవుతున్న కొడాలి నాని వరుస విజయాలు సాధిస్తున్నారు.దీంతో ఈ ఎస్సీ ఓట్లను చీల్చేందుకు రాముకు టీడీపీ సీటు ఇస్తోంది.
అయితే రాముకు పోటీగా అప్పటికే ఇన్ ఛార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు ఉన్నప్పటికీ ఆయనకు సర్దిచెప్పడంలో టీడీపీ అధిష్టానం సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు వెనిగండ్ల రాము.. వచ్చే ఎన్నికల్లో కొడాలిని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే టీడీపీలో అంతర్గత పోరు తగ్గడం, వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలిపై ఉన్న వ్యతిరేకత కచ్చితంగా తమకు కలిసి వస్తాయని తమ్ముళ్లు అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇదంతా తేలాలంటే ముందు రేపు జరిగే రా కదలిరా సభ ద్వారా టీడీపీ ఇచ్చే సంకేతమే కీలకం కానుంది. రేపటి సభలో పార్టీలో నేతల ఐక్యతతో పాటు కొడాలిని ఓడించగలమన్న ధీమా కనబరిస్తే వచ్చే ఎన్నికలకు ఓటర్లకు టీడీపీ ఓ సందేశం ఇచ్చినట్లవుతుంది.












Click it and Unblock the Notifications