మంగళగిరిలో లోకేష్ పై అభ్యర్ధి ఎవరు ? గంజిపై జగన్ లెక్కల్లో మార్పు వెనుక..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల లెక్కలు మారిపోతున్నాయి. ముందుగా ఇన్ ఛార్జ్ లను ప్రకటించడం ద్వారా ఎన్నికల వేళ తలనొప్పులు లేకుండా చూసుకునేందుకు ఓవైపు సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు పార్టీలో సీనియర్లే గండికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో లోకేష్ కు పోటీ ఇచ్చే దీటైన అభ్యర్ధి కోసం జగన్ వేట కొనసాగుతోంది.
మంగళగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకతను అధిగమించేందుకు బీసీ అభ్యర్ధి అయిన గంజి చిరంజీవిని రంగంలోకి దింపాలని జగన్ గతంలో నిర్ణయించారు. గతంలో 2014లో టీడీపీ అభ్యర్ధిగా గంజి చిరంజీవి.. వైసీపీ అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చిన పోటీని దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళగిరిలో లోకేష్ పై గంజి చిరంజీవి పోటీ ఖరారైపోయింది. ఆ తర్వాతే సీన్ మారింది.

తనకు బదులుగా గంజి చిరంజీవిని అభ్యర్ధిగా ప్రకటిస్తారని తెలిసి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోగా.. ఆ తర్వాత వైసీపీలో సీనియర్లుగా కనిపిస్తున్న కాండ్రు కమల, ఆమె మామ, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు రంగంలోకి దిగారు. ప్రచారంలోకి దిగిన గంజి చిరంజీవి.. స్ధానిక ఎమ్మెల్యే ఆళ్లను కలిసి మద్దతు అడిగేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన రానివ్వడం లేదు. అలాగని ఎమ్మెల్యే అనుచరుల్ని తనవైపుకు తిప్పుకుందామని ప్రయత్నిస్తున్నా వారు నో చెప్పేస్తున్నారు. చివరికి గడప గడపకూ ప్రచారానికి వెళ్తుంటే జనంలో ఆదరణ కనిపించడం లేదు.
ఇవన్నీ గమనిస్తున్న కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావు రేసులోకి వచ్చేశారు. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి ఖాయమనే ప్రచారం మొదలుపెట్టేశారు. సోషల్ మీడియాలో సైతం తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో గంజి చిరంజీవి సహజంగానే వెనుకబడ్డారు. ఇవే రిపోర్టులతో సీఎం జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు గంజిని డ్రాప్ చేసి కాండ్రు కమల లేదా మురుగుడు హనుమంతరావుల్లో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో లోకేష్ పై అభ్యర్ధిని ఖరారు చేసే విషయంలో వైసీపీ తకరారు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications