వరుస వివాదాలపై వైసీపీ మౌనం-పార్టీ క్రమశిక్షణ లోపిస్తోందా ? జగన్ మౌనం ఇందుకేనా !
ఏపీలో విపక్షాల్ని నామమాత్రంగా మార్చేసేందుకు 2019 నుంచి అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి. కానీ ఇప్పుడు సొంత పార్టీ నుంచే సెగ తప్పడం లేదు. గతంలో సరిగ్గా ఇలాంటి పరిస్ధితినే తెలంగాణలో టీఆర్ఎస్ కూడా ఎదుర్కొంది. అయితే దీన్నుంచి బయటపడేందుకు వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ రెండు నెలల్లోనే కొడాలి నాని, వంశీ, సుబ్బారావు గుప్తా వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్మాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అయితే వంశీ, నాని వ్యాఖ్యల్ని తప్పుబట్టిన గుప్తాను సైతం వైసీపీ టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తోంది.

వైసీపీలో వివాదాలు
ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు పదేళ్ల పాటు శ్రమించిన పార్టీ వైసీపీ. అధికారంలోకి రాగానే పదేళ్ల శ్రమతో పాటు ప్రజల్లో పెరిగిన ఆదరణను వృథా చేస్తున్న పార్టీ కూడా వైసీపీనే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే తాజాగా అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు చేశారని చెప్తున్న వ్యాఖ్యలతో పాటు తాజాగా సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

కొడాలి, వంశీ కామెంట్స్ పై మౌనం
వైసీపీ మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ చేశారని చెప్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయి. అయితే దీనిపై పార్టీ నుంచి నేరుగా ఓ ప్రకటన విడుదల చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే వాటిని ఖండిస్తూ ఓ ప్రకటన చేయొచ్చు. అలా కూడా కుదరకపోతే ఎదురుదాడి మంత్రాన్ని ఎంచుకోవచ్చు. కానీ వైసీపీ మాత్రం చంద్రబాబు, ఆయన సతీమణిపై వీరు చేసిన వ్యాఖ్యల విషయంలో మౌనంగా ఉండిపోయింది. చంద్రబాబు కన్నీళ్ల ఎపిసోడ్ తో తమకు సెగ తప్పదని భావించడం వల్లే ఇలా ఉండిపోయారన్న విమర్శలు వినిపించాయి.

సుబ్బారావు గుప్తా ఎపిసోడ్
కొడాలి నాని, వంశీ చేసిన కామెంట్స్ తో ప్రజల్లో వైసీపీకి ఉన్న ఫాలోయింగ్ 25 శాతం తగ్గిపోయిందంటూ ఆ పార్టీ కార్యకర్త సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే దీనిపైనా వైసీపీ నేతలు బహిరంగంగా స్పందించలేదు. దీన్ని ఖండించడమో, సుబ్బారావు గుప్తాను క్షమశిక్షణా రాహిత్యం కింద పార్టీ నుంచి తప్పించడమో చేయొచ్చు. కానీ వీటిలో ఏ ఒక్కటీ చేయకుండా నేరుగా సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుడు సుభానీతో దాడి చేయించి వీడియో తీయించి మరీ పబ్లిసిటీ చేయించారు. చివరికి అది కాస్తా ఎదురుతన్నడంతో బాలినేని వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

జగన్ మౌనం ఎందుకో ?
పార్టీలో ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత కమ్ సీఎంగా ఉన్న జగన్ మాత్రం ఈ ఘటనలపై స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఓవైపు పార్టీకి నష్టం, మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం అన్న రెండు కారణాల్లో ఏ ఒక్క దాన్నీ సీరియస్ గా తీసుకోవడం లేదు దీంతో రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని గొంతులు పైకి లేచే ప్రమాదం కూడా లేకపోలేదు. అయినా జగన్ మాత్రం ఇవేమంత పెద్ద విషయాలు కాదనేలా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారు సైతం దీనిపై నోరు మెదపడం లేదు. ఉదాహరణకు సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ బహిరంగంగా కలకలం రేపుతున్నా చర్యలపై సైతం ఎవరూ మాట్లాడటం లేదు దీంతో విపక్షాలు రెచ్చిపోతున్నాయి. అయితే తాను స్పందిస్తే ఈ సమస్యలు మరింత పెద్దవి అవుతాయన్న భయంతోనే జగన్ మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications