టీడీపీ నుంచి రూ 10 కోట్ల ఆఫర్ వచ్చింది -ఎమ్మెల్యే రాపాక సంచలనం..!!
ఏపీలో ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు వ్యవహారంలో మరో సంచలనం. ఇప్పటికే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలకు గురి చేసారని వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. ఒక్కొక్కొరికి రూ 10 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు చేసారు. క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంగా నలుగురు ఎమ్మెల్యేలను వైసీసీ సస్పెండ్ చేసింది. ఆ ఎమ్మెల్యేలు తాము డబ్బు తీసుకున్నామనే ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన నుంచి గెలిచి ప్రస్తుతం వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన అంశాలను బయట పెట్టారు.
టీడీపీ నుంచి రూ 10 కోట్ల ఆఫర్
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తనకు రూ 10 కోట్ల ఆఫర్ టీడీపీ నుంచి వచ్చిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ బయట పెట్టారు. మొదటి బేరం తనకే వచ్చిందని రాపాక తన మిత్రులతో షేర్ చేసుకున్నారు. తొలుత తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా సంప్రదింపులు చేసారని చెప్పుకొచ్చారు. అయితే, తన మిత్రుడు రాపాక అలా తీసుకొనే వ్యక్తి కాదని చెప్పి వారించారని వివరించారు. ఇక పోలింగ్ రోజు నాడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు నేరుగా ఆఫర్ ఇచ్చిందని వివరించారు. టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్ లో మంచి పొజీషన్ ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. తాను మాత్రం వారి ఆఫర్ ను తిరస్కరించానని. తాను సీఎం జగన్ ను నమ్ముకున్నానని..ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పానని రాపాక వెల్లడించారు.

పోలింగ్ సమయంలోనూ మాట్లాడారు
తన దగ్గర డబ్బు ఉండి కాదని.. డబ్బు తీసుకుంటే సమాజంలో బతకలేమని రాపాక చెప్పారు. సిగ్గు శరీరం వదిలేస్తే తనకు రూ 10 కోట్లు వచ్చేవన్నారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయం మంత్రి వేణుతో పాటుగా ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ తో మాత్రం షేర్ చేసుకున్నట్లుగా వివరించారు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ఎమ్మెల్సీ శ్రీదేవి గురించి పార్టీ ముందు నుంచే సందేహంతో ఉందని పేర్కొన్నారు. మేకపాటి కూడా టీడీపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. పోలింగ్ రోజు సమయంలోనూ అసెంబ్లీ లాబీల్లోనూ తనను సంప్రదంచారని వివరించారు. అయితే, ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేస్తారనే సమాచారం ముందే ఉందని రాపాక చెప్పుకొచ్చారు.
జగన్ తోనే ఉంటానని చెప్పాను
టీడీపీ లెజిస్లేచర్ మంతెన రాజు తనకు ఆఫర్ ఇచ్చారని రాపాక బయట పెట్టారు. ఇదే సమయంలో అటు టీడీపీ నుంచి డబ్బులు తీసుకొని క్రాస్ ఓటింగ్ చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనం, శ్రీదేవి, మేకపాటి ఖండించారు. తమకు డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని..తాము క్రాస్ ఓటింగ్ చేసారని ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ బయట పెట్టిన అంశంతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు రాపాక చెబుతున్న అంశాల పైన టీడీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఇదే సమయంలో ఇప్పుడు రాపాక చెబుతున్న అంశాలు రాజకీయంగా ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications