తిరుమలలో ఇదేం పని?: దివ్వెల మాధురిపై కేసు నమోదు
వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా తిరుమల కొండపై దువ్వాడ, మాధురి పలు ఫొటోలు దిగారు. ఫొటో షూట్‌లు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో రీల్స్ కూడా చేయడం ఆమెను చిక్కుల్లో పడేసింది.
పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణి తోపాటు ఆలయం దగ్గర ఫొటో షూట్ చేసినట్లు దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఫొటోషూట్, రీల్స్ చేయడంపై విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో దివ్వెల మాధురిపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వ్యవహరించారని 292, 296, 300 బీఎన్ఎస్, సెక్షన్66(ఈ) ఏటీ యాక్ట్, 2000-2008 సెక్షన్ల కింద దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
కాగా, గత సోమవారం దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వీఐపీ బ్రేక్ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి దగ్గర మాధురి షూట్ కొనసాగింది. ఈ క్రమంలోనే వారు పెళ్లిపై సంచలన ప్రకటన చేశారు. కోర్టు కేసులు అన్ని ముగిశాక త్వరలోనే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. అప్పటి వరకు తాము కలిసే ఉంటామని దివ్వెల మాధురి తెలిపారు. రెండేళ్లుగా మాధురితోనే కలిసి ఉంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కోర్టు కేసులు క్లియర్ అవ్వగానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి, పెళ్లిపై ఇరువురు క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథ చిత్రం మలుపులు తిరుగుతూ వస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని ,దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య , కూతుర్లు బహిరంగంగానే అతనిపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో వారు టెక్కలిలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతుళ్లు, కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తోంది.












Click it and Unblock the Notifications