Vidadala Rajini: విడదల రజనీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీకి ఇవాళ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రజనీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు మొదలయ్యాయి.. గతంలో ఆమె చేసిన తప్పిదాలన్నీ ఒకొక్కటిగా తవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇదే క్రమంలో రజనీపై చిలకలూరిపేట పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపై అరెస్టుకు సిద్దమవుతున్న తరుణంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
విడదల రజనీతో పాటు పలువురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు... చిలకలూరి పేట పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో విడదల రజనీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ముందస్తు బెయిల్ రాకపోయినా ఈ కేసులో రజనీకి ఊరట దక్కినట్లయింది. దీంతో పాటు కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీకి సంబంధించి పోస్టులు పెట్టిన వ్యవహారంలో విడదల రజనీతో పాటు ఆమె పీఏలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో రజనీపై కసు నమోదైంది. సోషల్ పోస్టుల కేసులో 2019లో అప్పటి పట్టణ సీఐ సూర్య నారాయణ తనను అరెస్ట్ చేశారని, కోర్టులో ప్రవేశపెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని హైకోర్టుకు తెలిపారు.
ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో రజనీ, ఆమె పీఏలపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ఆమె దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎల్లుండి తదుపరి విచారణ జరిగే వరకూ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీల్లేదు.












Click it and Unblock the Notifications