TTD EO : టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట- సింగిల్ బెంచ్ ఆదేశాలు సస్పెన్షన్..
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వాహక అధికారి (ఈవో) ధర్మారెడ్డిపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు హైకోర్టు ఊరట ఇచ్చింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల్ని సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు ధిక్కరణ కేసు నుంచి ఆయనకు విముక్తి లభించినట్లయింది.
అంతకు ముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి కోర్టు ధిక్కరణ కేసులో జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ముగ్గురు టీటీడీ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఆయన అమలుచేయలేదు. దీంతో తాత్కాలిక ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంతో ధర్మారెడ్డికి నెల రోజుల జైలు, రెండు వేల జరిమానా విధిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీన్ని ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు.

హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన జైలుశిక్ష, జరిమానా ఆదేశాల్ని ధర్మారెడ్డి డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా.. దీనిపై ఇవాళ విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాల్ని సస్పెండ్ చేసింది. పాలనా సమస్యల కారణంగా హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడంలో జాప్యం జరిగినట్లు ధర్మారెడ్డి చేసిన వాదనతో డివిజన్ బెంచ్ ఏకీభవించినట్లు తెలుస్తోంది. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలు సస్పెండ్ చేసింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆదేశాలు మాత్రం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications