వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై హైకోర్టు కీలక ఆదేశాలు..!
గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఇవాళ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ హయాంలో ఐదేళ్లలో 4 వేల కోట్ల మేర మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డితో పాటు మరో వైసీపీ ఎంపీ పాత్ర ఉన్నట్లు తెలిపింది. ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకు సీఐడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీఐడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరట ఇచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 3 వరకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా పలువురిని సీఐడీ అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతోంది. అయితే మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు అంతిమంగా ఎవరికి చేరిందనే విషయాన్ని మిథున్ రెడ్డి నుంచి రాబట్టేందుకు సీఐడీ ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు దానికి బ్రేక్ వేసింది.
మరోవైపు మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ, రేపట్లో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో తాత్కాలికంగా మిథున్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.












Click it and Unblock the Notifications