వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట..! ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..!
ఏపీలో వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి ఇవాళ ఊరట లభించింది. మద్యం స్కాంలో నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆయన చేసిన ఓ కీలక విజ్ఞప్తికి విజయవాడ ఏసీబీ కోర్టు అంగీకరించింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. సీఐడీ వ్యతిరేకించినా మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వైసీపీ ఎంపీ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ నెల 23 నుంచి నవంబర్ 4 వరకూ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే మద్యం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ పైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సీఐడీ సిట్ విభాగం ఈ విజ్ఞప్తినీ ఒప్పుకోలేదు. అయితే కోర్టు మాత్రం మిథున్ రెడ్డి చేసిన వాదనతో ఏకీభవిస్తూ షరతులతో అనుమతి ఇచ్చింది.

మిథున్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతించిన ఏసీబీ కోర్టు కొన్ని షరతులు పెట్టింది ఇందులో రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశీ పర్యటన తర్వాత తన పాస్‌పోర్టు కోర్టుకు అప్పగించాలని మిథున్‌రెడ్డిని ఆదేశించింది. దీంతో పాటు విదేశాల్లో ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ ఉంటారో వివరాలు ఇవ్వాలని కూడా కోరింది. ఏపీ మద్యం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఈ షరతులకు అంగీరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసి అనుమతి తీసుకోనున్నారు.

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా అరెస్టు నుంచి తప్పించుకోలేకపోయారు. దీంతో ఆయన గతంలో కోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవడంతో రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపారు. అక్కడ కొంతకాలం ఉన్నాక బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది.












Click it and Unblock the Notifications