ఇదీ గ్రౌండ్ రియాల్టీ - ఎన్నికల్లో జరిగేదిదే : తేల్చేసిన టీడీపీ స్ట్రాటజిస్ట్ రాబిన్..!!
టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ తెర ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు పార్టీకి తెర వెనుక వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శర్మను టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పరిచయం చేసారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాబిన్ శర్మ తాజాగా పార్టీ ప్రకటించిన ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి వివరించారు. 2019 ఎన్నికల సమయంలో నాడు జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ టీంలో రాబిన్ శర్మ క్రియాశీలకంగా వ్యవహరించారు.

నాడు పీకేతో కలిసి పని చేసిన రాబిన్
పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఒక సంస్థను ఏర్పా టు చేసుకొని వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు. రాబిన్‌ను తీసుకు న్న తర్వాత కొంతకాలం కిందట టీడీపీ నాయకత్వం సునీల్ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా నియమించుకుంది. అయితే సునీల్‌కు ఏపీ పై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయనను పక్కన పెట్టింది.
సునీల్ కనుగోలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ సమావేశంలో రాబిన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో వివరించారు. వైసీపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారనే అభిప్రాయం వ్యాప్తి చేస్తోందని చెప్పుకొచ్చారు.

క్షేత్ర స్థాయిలో వైసీపీ చేస్తుందిదే
ఇచ్చిన హామీలన్నీ అమలు చేసామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని గుర్తు చేసారు. ఇప్పుడు అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పైన సానుకూలత పెంచుకొనే ప్రయత్నం చేస్తుందని విశ్లేషించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు కౌంటర్ గా ప్రతిపక్ష పార్టీగా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పథకాలు..ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రచారం వైసీపీ బలంగా భావిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలగా మలచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహానికి ధీటుగా.. ప్రజా సమస్యల పైన పోరాటం అవసరమని నిర్దేశించారు. ఎన్నికల వరకు నేతలంతా ప్రజల్లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

టీడీపీ నేతలకు రూట్ మ్యాప్
ప్రజా సమస్యలను ప్రతిపక్ష పార్టీగా బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో మమేకం అవుతూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. టీడీపీ ఎన్నికలకు సిద్దంగా లేదనే అభిప్రాయంతో వైసీపీ ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని ఇదే సమయంలో చంద్రబాబు స్పష్టం చేసారు. తాజాగా ప్రకటించిన ఇదేం ఖర్మ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పై ఎన్నికల సమరశంఖం పూరించినట్లుగా పార్టీ ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా రాబిన్ శర్మ టీం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ..కావాల్సిన వ్యూహాలను.. ప్రచార తీరు పైన పార్టీకి సూచనలు అందిచనుంది.












Click it and Unblock the Notifications