బంగాళాఖాతం భీకరం: విశాఖలో అర్ధరాత్రి కుప్పకూలిన రిటైనింగ్ వాల్
Visakhapatnam: కొంతకాలంగా వరుసగా సంభవిస్తోన్న అల్పపీడనాలు, తుఫాన్ తరహా వాతావరణ పరిస్థితుల వల్ల బంగాళాఖాతం భీకరంగా మారింది. గతంలో ఎప్పుడూ లేనంతగా అలల ఉధృతి పెరిగింది. కెరటాలు ఎగిసిపడుతోన్నాయి. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది కూడా.
ఇదే తరహా పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతూనే వస్తోన్నాయి. తాజాగా ప్రతిష్ఠాత్మక ఆర్ కే బీచ్ సమీపంలో నొవాటెల్ హోటల్ వద్ద జీవీఎంసీ చిల్డ్రన్స్ పార్క్‌కు చెందిన రిటైనింగ్ వాల్ కొంత భాగం కుప్పకూలింది. అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. అలల ఉధృతికి ఈ రిటైనింగ్ వాల్ పేకమేడలా కూలింది. అక్కడ ఇసుక కోతకు గురైంది.

దాదాపుగా 200 మీటర్లకు పైగా పొడవు గల రిటైనింగ్ వాల్ ఇది. ఆర్‌కె బీచ్‌లో ఇసుక కోతకు గురి కావడం వల్ల తొలుత రిటైనింగ్ వాల్‌లో పగుళ్లు ఏర్పడ్డాయని, అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం చేస్తూ కుప్పకూలిందని తెలుస్తోంది. ఫలితంగా జీవీఎంసీ పార్క్ కొంతమేర దెబ్బతిన్నది.
గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2021లో జవాద్ తుఫాన్ ధాటికి రిటైనింగ్ వాల్ కొంతభాగం కుప్పకూలింది. అలల ధాటికి 70 మీటర్ల మేర రిటైనింగ్ వాల్ కూలిపోయింది. తీరంలో భూమి కొంత కుంగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ దెబ్బతింది. బీచ్ రోడ్డులో భూమి కోతకు గురైంది. అప్పట్లో ఆంధ్రా యూవివర్సిటీ మెట్రోలాజికల్, సివిల్ ఇంజనీర్లు కోతకు గల కారణాలపై అధ్యయనం చేశారు.
#WATCH | The retaining concrete wall of the GVMC park near Novotel on RK Beach in Visakhapatnam has collapsed putting a large part of the wall at risk.
— ANI (@ANI) January 16, 2025
More than 200 metres of the concrete wall is likely to be affected due to erosion caused by high waves. A portion of the… pic.twitter.com/FVmovtI7bP
ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తాయి. వరుస అల్పపీడనాల ప్రభావంతో బంగాళాఖాతం ఉగ్రరూపాన్ని ధరిస్తోండటం వల్ల కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు చొచ్చుకుని వస్తోన్నాయి. కిందటి నెలలో విశాఖపట్నం- అనకాపల్లి వద్ద తీరం పెద్ద ఎత్తున కోతకు గురైన విషయం తెలిసిందే. సుమారు 50 మీటర్ల వరకు సముద్రం ముందుకు దూసుకొచ్చింది.












Click it and Unblock the Notifications