వైజాగ్ స్టీల్ పై అదానీ కన్ను-గంగవరం వాటా అందుకే-కేంద్రంతో జగన్ కుమ్మక్ము-రిటైర్డ్ ఐఏఎస్ షాకింగ్
ఏపీలోని గంగవరం పోర్టును అదానీ గ్రూప్ చాలా సులువుగా చేజిక్కించుకుంది. గంగవరం పోర్టులో తమకున్న పది శాతం వాటాను అదానీ గ్రూప్ కు వైసీపీ సర్కార్ అమ్మేయడంతో పాటు మిగతా భాగస్వా్ములు కూడా తమ వాటాలు సమర్పించుకోవడంతో గంగవరం పోర్టు అదానీ పరమైంది. అయితే ఈ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే అనుమానాలు జనం మొదళ్లలో నుంచి ఇంకా తొలగిపోలేదు. ఇప్పుడు విశాఖకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ దీనిపై సంచలన విషయాలను బయటపెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కన్నేసిన అదానీ గ్రూప్ ఇందులో భాగంగానే గంగవరం పోర్టును ముందుగా దక్కించుకుందన్నారు.

గంగవరం పోర్టు అమ్మకం
విశాఖ జిల్లాలోని గంగవరం పోర్టులో 58.1 శాతం వాటా కలిగిన డీవీఎస్ రాజు కుటుంబం దీన్ని దేశంలోనే మౌలిక సదుపాయాల రంగంలో బిగ్ షాట్ అయిన అదానీ గ్రూప్ కు విక్రయించాలని గతేడాది నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ లో భాగంగా ఉన్న అదానీ పోర్ట్స్ రూ.3604 కోట్లకు గంగవరం పోర్టులో తనకున్న 58.1 శాతం వాటాను డీవీఎస్ రాజు కుటుంబం విక్రయించింది. ఆ తర్వాత వెనువెంటనే ఏపీ ప్రభుత్వం కూడా తనకున్న 10.4 శాతం వాటాను కూడా అదానీ గ్రూప్ కు విక్రయించేసింది. అనంతరం మిగతా భాగస్వాములు కూడా తమ వాటాల విక్రయంతో గంగవరం పోర్టు అదానీ గ్రూప్ కు గంపగుత్తగా స్వాధీనమైంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
గతేడాది నష్టాల బాటులో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్ లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల్ని ఏడాదిలోగా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలోని దిగ్గజ సంస్ధల్లో ఎవరో ఒకరికి ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా దీన్ని కట్టబెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగులు, కార్మికసంఘాలు, ఏపీలో రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రేపో మాపో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని తేలిపోయింది. కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి పెట్టినా ఫలితం లేకపోవడంతో జగన్ సర్కార్ కూడా మౌనంగా ఉండిపోతోంది.

రిటైర్డ్ ఐఏఎస్ శర్మ షాకింగ్ వ్యాఖ్యలు
సామాజిక అంశాలపై గళమెత్తే రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఈసారి గంగవరం పోర్టులో వాటాల అమ్మకంపై స్పందించారు. గంగవరం పోర్టును చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ చేసిన ప్రయత్నాలకు ఏపీ ప్రభుత్వం వంతపాడుతూ తన వాటాలు విక్రయించడం అవివేకమని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఏపీ తూర్పు తీరంలో అదానీ గ్రూప్ గుత్తాధిపత్యానికి వైసీపీ సర్కార్ సహకరిస్తున్నట్లయిందని శర్మ తెలిపారు. తూర్పు తీరంలో ఉన్న పోర్టులన్నీ చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం లేదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

గంగవరం పోర్టుతో వైజాగ్ స్టీల్ లింక్ ?
విశాఖ తీరంలో ఉన్న గంగవరం పోర్టుతో నగరంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు లింక్ ఉందా అనే అనుమానాలు కొత్తగా తెరపైకి వచ్చాయి. గంగవరం పోర్టులో మెజారిటీకి పైగా వాటాల్ని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కన్నేసిందన్న ప్రచారం జరుగుతోంది. అసలు ఇందుకోసమే గంగవరం పోర్టు వాటాల్ని కొనుక్కుందనే వాదన కూడా వినిపిస్తోంది. గంగవరం పోర్టు కొనుగోలు ద్వారా రేపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా చేజిక్కించుకుని అక్కడ ఉత్పత్తి అయ్యే ఉక్కును విదేశాలకు రవాణా చేసుకోవచ్చనేది అదానీ గ్రూప్ ఆలోచనగా తెలుస్తోంది. దీనిపై తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

వైజాగ్ స్టీల్ కోసమే గంగవరం కొన్న అదానీ ?
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుందని ప్రకటన చేసిందో అప్పుడే గంగవరం పోర్టుపై అదానీ కన్నుపడిందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో భవిష్యత్తులో దీన్ని చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు ఇందుకోసమే ముందుగా గంగవరం పోర్టును కొనుగోలు చేసిందన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పాటు ఇతర వాటాదారుల నిర్ణయాలు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. దీంతో వైజాగ్ స్టీల్ ను అదానీ గ్రూప్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతన్నట్లు శర్మ చెప్పకనే చెప్పారు.
Recommended Video

కేంద్రంతో జగన్ కుమ్మక్కు
ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకు ఏపీలో వైసీపీ సర్కార్ సహకరిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. వైసీపీ సర్కార్ పరోక్షంగా కేంద్రంతో కుమ్మక్మై విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ కు మార్గం సుగమం చేస్తున్నట్లు శర్మ ఆరోపించారు. ఇందుకోసం పెట్టుబడుల ఉపసంహరణ మార్గదర్శకాలను సైతం ఉల్లంఘిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. గంగవరం పోర్టులోవాటా విక్రయం విషయంలోనుూ ప్రభుత్వం అంతర్జాతీయ బిడ్డింగ్ కు వెళ్లి ఉంటే మంచి ధర దక్కేందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగేదని శర్మ తెలిపారు. అలా కాకుండా అదానీకి దాన్ని సులువుగా కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందని శర్మ విమర్శించారు.












Click it and Unblock the Notifications