డీలిమిటేషన్ బిల్లుకు మద్దతా ? టీడీపీ, వైసీపీపై రిటైర్డ్ ఏఐఎస్ ల ఫైర్..!
కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనల మధ్య ఏపీకి చెందిన కూటమి పార్టీలు పార్లమెంట్ లో ఎన్డీయేకు అండగా నిలిచాయి. ఇందులో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి డీలిమిటేషన్ కారణంగా అన్యాయం జరుగుతున్నా కేంద్రానికి తమ స్వప్రయోజనాల కోసం మద్దతిస్తున్నరాజకీయ పార్టీలపై రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మండిపడుతున్నారు.
గతంలో ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ పీవీ రమేశ్..ఇవాళ డీలిమిటేషన్ వల్ల జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు ఓ ట్వీట్ చేశారు. ఇందులో తోటి పౌరుడిగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానమని ఆయన తెలిపారు. ఇది భారత గణతంత్ర వ్యవస్థలో వారి రాజకీయ ప్రాధాన్యతను మరింతగా క్షీణింపజేస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ తమ సొంత రాజకీయ మనుగడ కోసం మన ఆత్మగౌరవాన్ని బేరానికి పెట్టాయన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు, మహిళా రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవానికి, మహిళలకు 33.3% సీట్లను కేటాయించే చట్టం ఇప్పటికే అమలులో ఉందన్నారు. సంబంధం లేని ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసిన ఆంధ్ర రాజకీయ నాయకుల కపట చర్యలను మనం తిరస్కరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో ఎటువంటి రాజీకి తావు ఉండకూడదన్నారు. ఈ అవినీతి రాజకీయ నాయకుల కపట స్వభావాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు.
గతంలో సీబీఐ డైరెక్టర్ గా పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో పార్లమెంటులోని ప్రతి రాష్ట్రపు సీట్ల నిష్పత్తికి ఎలాంటి నష్టం జరగదని, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని ఎన్డీఏ తరపున గౌరవనీయ ప్రధానమంత్రి గారు దేశానికి ఇచ్చిన హామీకి కృతజ్ఞతలు అంటూ మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు. మీరు ఇంతకంటే అమాయకంగా, సులభంగా మోసపోయేవాళ్ళు అనుకోలేదన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ అవశేష రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, అది ఎప్పుడైనా కార్యరూపం దాల్చిందా? అని ప్రశ్నించారు.

ఇలాంటి హామీలు అర్థరహితం - అవి ఎక్కువగా ప్రజలను మోసం చేయడానికే ఉద్దేశించినవే అన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వారీ ఎంపీ సీట్ల నిష్పత్తిని కొనసాగించడానికి మోదీ నిజంగా కట్టుబడి ఉంటే, దానిని రాజ్యాంగ సవరణ బిల్లులో గానీ, డీలిమిటేషన్ బిల్లులో గానీ ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఆయన అలా చేయకపోవడమే ఆయన చిత్తశుద్ధితో లేరని, కేవలం ప్రజలను మోసం చేస్తున్నారని సూచిస్తోందన్నారు. లేదా, ఇక్కడ అమాయకంగా ఉన్నది మీరేనని నేను అనుకోవడం అతిగా ఆశించడమేనా అని ప్రశ్నించారు.













Click it and Unblock the Notifications