అభిషేకం: రేవంత్, ఏపీ గొప్పగాలేదు: కేసీఆర్, బాబుతో సై
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ సమావేశాలు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. మూడేళ్లలో 21వేల మెగావాట్ల విద్యుత్ తెస్తామని కేసీఆర్ చెప్పారని, అలా తెస్తే ఆయనకు నిండు సభలో పాలాభిషేకం చేస్తామని, లేదంటే ఆయన సభలో క్షమాపణ చెప్పాలని రేవంత్ అన్నారు.
దానికి కేసీఆర్ స్పందిస్తూ.. మూడేళ్లలో 24 గంటల పాటు విద్యుత్ అందిస్తామని చెప్పామని, చేసి చూపిస్తామన్నారు. అంతకుముందు రేవంత్ మాట్లాడుతూ.. తాము బేషజాలకు వెళ్లడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు మీద తప్పు నెట్టేస్తే తెరాస రాజకీయంగా లబ్ధి పొందుతుందేమో కానీ, ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. ఇరు రాష్ట్రాల సమస్యలను కేంద్రం పరిష్కరించాలన్నారు. లేదంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

హరీష్ రావు తమిళనాడు, కర్నాటక వంటి ఉదారహణలు చెప్పారని, కానీ తాము కూడా తెలంగాణ ప్రజల పక్షానే ఉన్నామన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారు ఆ రాష్ట్ర ప్రజల తరఫున పోరాడుతాన్నారు. అలాగే తాము తెలంగాణ ప్రజల తరఫున ఉన్నామన్నారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు తాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.
దానికి కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణపట్నం విద్యుత్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ చేయడం లేదన్నారు. విద్యాసాగర రావు, జూపల్లి కృష్ణా రావుల పైన రేవంత్ రెడ్డి ఆరోపణలు సరికాదన్నారు. తెలంగాణ ప్రజల మంచినీటి కోసమే జూపల్లి కోర్టుకు వెళ్లారన్నారు. కృష్ణపట్నంలో 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. తమ వద్ద అలావుద్దీన్ అద్భుత దీపం లేదన్నారు.
విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోను ఇప్పుడు గొప్పగా ఏమీ లేదన్నారు. అక్కడ కూడా విద్యుత్ సంక్షోభం ఉందన్నారు. ఏపీ విద్యుత్‌ను కొనుక్కుంటోందని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం కలిసి పని చేస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. అయితే, 57 ఏళ్లలో సాధ్యం కానిది ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమవుతుందన్నారు.
ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను క్రూరంగా, అక్రమంగా లాగేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన ఏడు మండలాలకు కూడా తామే విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖలో తుఫాన్ వస్తే తాము మానవత్వంతో స్పందించామన్నారు. ట్రాన్సుఫార్మర్లు, విద్యుత్ కండక్టర్లు పంపించామని చెప్పారు. అనుకున్నంత విద్యుత్ లేదు కాబట్టి రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఏపీతో కలిసి పని చేసేందుకు తనకు ఎలాంటి బేషజాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications