మీ సన్నిహితుడే: ధరలపై కెసిఆర్‌ను ఏకేసిన రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బుధవారం నిప్పులు చెరిగారు. సిమెంట్ ధరల పెంపుపై కెసిఆర్ శాసన సభను తప్పుదోవ పట్టించాలని చూశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సిమెంటు ధరలను పెంచి, కృత్రిమ కొరత సృష్టిస్తే ఆ కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో సిమెంట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తే కాంపిటీషన్ కమిషన్ విచారణ చేపట్టి 11 సిమెంట్ కంపెనీలపై రూ.6,500 కోట్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా సిమెంట్ పరిశ్రమలు, గోదాములపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిమెంట్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచితే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కుంభకోణంలో కెసిఆర్ సన్నిహితుడి హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. సిమెంట్ ధరల పెంపు అంశం తమ చేతుల్లో లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
విశాఖలో...
విశాఖను ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా తెలిపారు. ప్రతిష్ఠాత్మక ఐఐఎం, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ వంటి వాటిని విశాఖలో నిర్మించనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, ఉత్తమ విద్యావ్యవస్థను నెలకొల్పుతామని ఆయన తెలిపారు.
యూనివర్సిటీల ఏర్పాటుకు భూసేకరణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో దేశంలోని విద్యార్థులంతా విద్యకోసం అంధ్రప్రదేశ్‌కు వచ్చేలా విద్యావ్యవస్థను తయారు చేస్తామన్నారు. అలాగే ఐటీ పరిశ్రమకు కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. పలు సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోందన్నారు.












Click it and Unblock the Notifications