కృష్ణారావు టీఆర్ఎస్‌లోకి ఎందుకెళ్లారో బయటపెడ్తా: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కూకట్ పల్లి శాసన సభ్యుడు మాధవరం కృష్ణారావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఓ టీవీ ఛానల్ చర్చలో ఆదివారం భగ్గుమన్నారు. ఆయకు తెరాస ఇవ్వజూపిన తాయిలాల వివరాలు త్వరలోనే తాను బయటపెడతానని చెప్పారు.
తాము పార్టీలు మారిన నేతలను విమర్శించడం లేదని, అయితే వారు పార్టీ మారడానికి దారితీస్తున్న కారణాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం ఎవరూ పార్టీలు మారడం లేదన్నారు. కేవలం తెరాస ప్రలోభాలకు ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. దానిని మాత్రం తప్పుపడుతున్నామన్నారు.

ఈ విధానం రాజకీయాలకు సరికాదన్నారు. వ్యక్తిగత స్వార్థంతో పదవులు పొందేందుకు, సంపాదన వెనుకేసుకునేందుకు పార్టీలు మారడం సరైన విధానం కాదన్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా సరికాదన్నారు. కృష్ణారావుకు తెరాస చూపిన తాయిలాలు త్వరలో చెబుతానన్నారు.
కాగా కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న వారికి కాకుండా తెలంగాణ ద్రోహులకు పదవులు ఇస్తున్నారని తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
కేసీఆర్ మంత్రివర్గంలో టీడీపీ నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే, వీరు ఒక్కసారి కూడా ఉద్యమంలో పాల్గొన్నది లేదని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో ఉద్యమంలో పాల్గొన్న వారికి కేసీఆర్ మొండిచేయి చూపుతున్నారని, అందుకే చాలామంది ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారని ఎర్రబెల్లి అంటున్నారు.












Click it and Unblock the Notifications