ఎసిబి కార్యాలయానికి రేవంత్ రెడ్డి షిఫ్ట్: కెసిఆర్‌ను అరెస్టు చేయిస్తానని వ్యాఖ్య
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇవ్వజూపుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల తమ కార్యాలయానికి తరలించారు. ఆయనపై ఎసిబి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దె దించి ఆయన కుటుంబం ఆక్రమాలను బయటపెట్టి ఇదే అధికారులతో తాను అరెస్టు చేయిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. తాను కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కుంటున్నాను కాబట్టే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, ఆత్మ స్థయిర్యం కోల్పోయేది లేదని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ తన వెనక ఉందని, పార్టీ కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని ఆయన అన్నారు. ఏ పార్టీ నామినేట్ చేస్తే ఎమ్మెల్యే అయ్యారని, అది మీడియాకు తెలియదా అని రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాను కెసిఆర్ బంద్ చేసినప్పుడు ఏమిటో మీకు తెలియదా అంటూ ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి దగ్గర డబ్బు దొరికిందన్నది అవాస్తవమని, ప్రభుత్వం కుట్రపూరితంగా రేవంత్‌ను ఇరికించిందని తెలంగాణ తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తమ అభ్యర్థికి ఓటేయమని ఎవరు ఎవరినైనా అడగవచ్చునని అన్నారు.
తాను ఎవరి ద్వారా మధ్యవర్తిత్వం జరపలేదని, ఎవరికీ తాను డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్నేహితుడిని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని వివరించారు. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం కేసీఆర్ ఇంతటి నీచానికి దిగజారుతారని అనుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications