రజనీకాంత్ కూడా: హరీష్, చేతకాక: కేసీఆర్‌పై రేవంత్
హైదరాబాద్: తమిళనాడు - కర్నాటక రాష్ట్ర జల వివాదం సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి రిక్షా కార్మికుడి వరకు అందరు తమ తమ రాష్ట్రాల కోసం పోరాడితే, తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం పక్క రాష్ట్రానికి మద్దతుగా నిలబడటం దారుణమని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం సభలో అన్నారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలు, రైతులు నీరు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ పక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాట్లాడటం విడ్డూరమన్నారు. స్వాతంత్రం కోసం నాడు కుల, మతాలకు అతీతంగా, భారత్, పాకిస్తాన్‌లు ఒక్కటై పోరాడాయాన్నారు. ఉద్యమంలో కలిసి రాని టీడీపీ పునర్నిర్మాణం కోసమైనా కలిసి వస్తుందనుకుంటే రావడం లేదన్నారు.

తెలంగాణ పైన చంద్రబాబు కుట్రలు పన్నుతుంటే రాష్ట్రమంతా వ్యతిరేకిస్తోందని, తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం మద్దతిస్తున్నార్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టవద్దన్నారు. పుట్టిన గడ్డకు ద్రోహం చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఆంధ్రా గొంతు వినిపించడం దారుణమన్నారు. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పక్క రాష్ట్రం నాయకుడి కనుసన్నుల్లో తెలంగాణ టీడీపీ నేతలు పని చేయడం దారుణమన్నారు. ఇది పార్టీలు, వ్యక్తుల మధ్య సమస్య కాదన్నారు. పార్టీల కతీతంగా సమస్య పైన పోరాడం చేయాలన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యల పైన రేవంత్ రెడ్డికూడా తీవ్రంగా స్పందించారు. విద్యుత్ సమస్యను తీర్చలేని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం పక్క రాష్ట్రం పైన అపవాదు వేసి తప్పించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు పైన తప్పు నెట్టి కాలయాపన చేయడం ఏమిటన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదనను చంద్రబాబు అడ్డుకుంటున్నారని, దానికి కారకులు ఎవరన్నారు. జూపల్లి వంటి వారు కాదా అని ప్రశ్నించారు. అనంతరం సభ నాలుగు గంటలకు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications