పవన్ కు ఊహించని షాక్ ? టీడీపీతో పొత్తుపై జనసేనలో చిచ్చు ? రంగంలోకి నాగబాబు, నాదెండ్ల !
ఏపీలో వైసీపీని ఓడించేందుకు విపక్షాలన్నింటినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టడంతో అక్కడికి వెళ్లి పరామర్శించిన పవన్.. అక్కడే పొత్తుపై కూడా ప్రకటన చేసేశారు. ఇది జనసేన నేతలకు జీర్ణం కావడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా వారు తమ అసంతృప్తిని వెళ్లగక్కడం మొదలుపెట్టారు. దీంతో వారిని బుజ్జగించేందుకు జనసేన కీలక నేతలు రంగంలోకి దిగారు.
వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్ని కలుపుకుని పోటీ చేస్తామని ఎప్పటి నుంచో క్యాడర్ కు చెప్తుూ వచ్చిన పవన్..చంద్రబాబు అరెస్టు తర్వాత అదే సరైన సమయంగా భావించి పొత్తుపై ప్రకటన చేసేశారు. అప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో దూరంగా ఉంటూ వస్తున్న పవన్.. టీడీపీతో పొత్తును ప్రకటించడమే కాకుండా క్షేత్రస్ధాయిలో టీడీపీతో కలిసి సాగేలా క్యాడర్ కు దిశానిర్దేశం కూడా చేశారు. దీంతో అంతా సజావుగా సాగిపోతుందని ఇరుపార్టీల నేతలు భావించారు. కానీ అక్కడే తేడా మొదలైంది.

టీడీపీతో పొత్తును జీర్ణించుకోలేని కొందరు జనసేన నేతలు సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టారు. టీడీపీపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జనసేన తరఫున యూట్యూబ్, ఫేస్ బుక్ లో బలంగా తన వాణి వినిపించే కళ్యాణ్ దిలీప్ సుంకర వంటి వాళ్లు వ్యవస్ధల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు చూపిన బాటలోనే జగన్ వెళ్తున్నారంటూ చేసిన విమర్శలు టీడీపీకి మంటపుట్టించాయి. దీంతో టీడీపీ నేత మహాసేన రాజేష్ కూడా యూట్యూబ్ లోనే దీనికి బదులిస్తూ ఇరుపార్టీల మధ్య పొత్తును గుర్తుచేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం జనసేన నేత నాగబాబు వద్దకు వెళ్లింది.
టీడీపీపై కళ్యాణ్ దిలీప్ సుంకర ఫిర్యాదుపై స్పందించిన నాగబాబు.. ఆయనకు పొత్తు ధర్మాన్ని గుర్తు చేసి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. యూట్యూబ్ లో పొలిటికల్ వీడియోలకు బ్రేక్ ఇచ్చి ఫేస్ బుక్ లో మాత్రం వీడియోలు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైనా చర్చ జరుగుతుండటంతో జనసేన నేతలు కూడా ఆయన లేవనెత్తుతున్న అంశాలపై చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ పార్టీ జిల్లా, నగర అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఇందులో వారికి కీలక దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశంతో పొత్తు, ఇరు పార్టీల ఉమ్మడి కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశంలో పవన్ ఇప్పటికే ఓ ప్రకటన చేశారని, అయితే ఇరువురు నాయకులు చర్చించుకునే అవకాశం రాలేదని, అందువల్ల ఉమ్మడి కార్యాచరణ సాధ్యం కాలేదని నాదెండ్ల తెలిపారు. అలాగే టీడీపీ ఆందోళనలకు జనసేన మద్దతు విషయంలో ఎలా వ్యవహరించారో దిశానిర్దేశం చేశారు.టీడీపీ నాయకులతో ఎక్కడా పొరపొచ్చాలు రాకుండా సమన్వయంతో సానుకూల దృక్పథంతో సంప్రదింపులతో ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలన్నారు. త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ సిద్ధమవుతుందని, అప్పటి వరకు సమయానుకూలంగా పార్టీ నియమావళికి లోబడి ముందుకు వెళ్లాలని సూచించారు.
ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్వహణ విషయంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.












Click it and Unblock the Notifications