ఓటుకు నోటుపై చర్చ: మత్తయ్యకు ఎందుకు ఆశ్రయమిచ్చారని ప్రశ్నించిన రోజా
హైదరాబాద్: ఓటుకు నోటు కేసుపై అసెంబ్లీలో తాము వాయిదా తీర్మానం ఇస్తే టీడీపీ ఉలిక్కిపడుతోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ తీర్మానంపై టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్న కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసు కోర్టులో ఉన్నందున దీనిపై చర్చకు అనుమతించనని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. కోర్టులో ఉన్న వైయస్ జగన్ కేసుల గురించి టీడీపీ నేతలు మాట్లడుతుంటే స్పీకర్ మౌనంగా ఉండటం ఉండటం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసు తెలంగాణకు సంబంధించిందని అంటున్నారని, అలాంటప్పుడు మత్తయ్యకు ఏపీ ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించిందని రోజా ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ యత్నించిందని విమర్శించారు.
ఆడియోలో ఉన్న స్వరం చంద్రబాబుదా? కాదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు నుంచి బయటపడే మార్గాలను అన్వేషించేందుకు ఇప్పటివరకు డీజీపీతో చంద్రబాబు 15 సార్లు సమావేశమయ్యారని అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే 'ఓటుకు నోటు' కేసుపై చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications