'ఆ మంత్రులను చంద్రబాబు భర్తరఫ్ చేయాలి', 'జగన్ దీక్షతో ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులెవరు'
విజయవాడ: సోమవారం విజయవాడలోని స్టెల్లా కాలేజీలో అత్మహత్య చేసుకున్న భానుప్రీతి కుటుంబాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కదిరి ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ భానుప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ మంత్రులు పీతల సుజాత, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో సీఎం చంద్రబాబు నాయుడే వారిని భర్తరఫ్ చేయాలన్నారు.
విద్యార్ధులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందన్నారు. పీతల సుజాత స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి అయినప్పటికీ విద్యార్థినుల ఆత్మహత్యలపై పట్టించుకోకుండా ఆదాయాన్నిచ్చే గనుల శాఖపైనే తన దృష్టంతా ఉందని ఆమె విమర్శించారు.

భానుప్రీతి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని రోజా డిమాండ్ చేశారు.
వైయస్ జగన్ దీక్షపై డొక్కా
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తొందరపాటు దీక్షలు మానుకుని ఏపీ అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
వైయస్ జగన్ తొందరపాటు దీక్షల వల్ల చాలా అనర్ధాలు జరిగే అవకాశం ఉందని, ప్రత్యేకహోదా రాలేదని తొందరపడి ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే దీనికి బాధ్యులు ఎవరని డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు. దీంతో వైయస్ జగన్ దీక్ష మానుకుని ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications