బాబుది ‘నీరు-బారు’, ఇక ఎర్ర చంద్రమనే పిలవాలా?: రోజా సెటైర్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు.

తాగు బోతు ప్రభుత్వం
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి తాగుబోతు ప్రభుత్వంలా మారిందని మండిపడ్డారు.
లిక్కర్ సిండికేట్ ఓనర్లంతా కలిసి కేబినెట్ సమావేశం పెట్టుకున్నటుందని ఎద్దేవా చేశారు.

బాబుది నీరు-బారు
సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు ధిక్కరిస్తున్నాకని అన్నారు. లిక్కర్ దుకాణాల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేయడం దారుణమని మండిపడ్డారు. నీరు-మీరు కార్యక్రమంలా నీరు-బారు కార్యక్రమం చేపట్టారని రోజా ధ్వజమెత్తారు.

మహిళల ఉసురు తప్పదు..
మెడికల్ షాపుల్లో కూడా బీరు అమ్మేలా ఏపీ సర్కారు ఉందన్నారు. చంద్రబాబుకు మహిళల ఉసురు తగులుతుందన్నారు. మహిళల ఆందోళనలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మద్యం పాలసీపై ప్లీనరీలో వైయస్ జగన్ ప్రకటన చేస్తారని చెప్పారు. ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వెనక్కు తీసుకోకపోతే లిక్కర్ షాపులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

ఎర్ర చంద్రమనే పిలవాలా?
మహిళల కోసం పోరాడుతున్న తమపై కేసులు పెట్టినా భయపడమని స్పష్టం చేశారు. హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దుంగలు దొరకడాన్ని బట్టి చంద్రబాబు వ్యాపారం ఎలా పెరుగుతుందో అర్థమవుతోందని అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు స్పందించకపోతే ఎర్ర చంద్రమని పిలవాల్సి వస్తుందని ఎమ్మెల్యే రోజా అన్నారు.












Click it and Unblock the Notifications