ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది - రోజా
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా అంశంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభలకు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనను అడ్డుకునేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు.
రోజా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా మండిపడ్డారు. పాలనను పక్కనపెట్టి దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రోజా స్పష్టం చేశారు. ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఓడించలేదని, ఈవీఎంలలో జరిగిన గోల్‌మాల్ ద్వారానే ఆయన ఓటమిపాలయ్యారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు.

మహిళల అక్రమ రవాణా వంటి సున్నితమైన అంశాన్ని ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా పవన్ కల్యాణ్. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లను తొక్కిపెట్టి నార తీయాలి కదా? అని ఆయనను ఉద్దేశించి నిలదీశారు. వైఎస్ జగన్ నిర్వహించే సభలకు ప్రజలు పెద్దఎత్తున తరలిరాకుండా అడ్డుకోవాలనేది ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని రోజా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications