జగన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు: రోజా, ‘చంద్రబాబు కక్ష సాధింపు’
తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రతిపక్షం మీద కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని రోజా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం, వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని రోజా జోస్యం చెప్పారు. అప్పుడు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు.

కాగా, గత ఎన్నికల్లో తనపై నమ్మకంతోనే వైయస్ జగన్ టికెట్ ఇచ్చారని తెలిపారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. నగరి ప్రజలను జీవితంలో మర్చిపోలేనని అన్నారు. సోమవారం తన సొంత నిధులతో నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన సందర్భంగా రోజా మాట్లాడారు.












Click it and Unblock the Notifications