మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు..!
తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ తరుణంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని అతివేగంగా దూసుకొచ్చిన ఓ తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా ఒడిశా నుంచి విశాఖ వస్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కోటబొమ్మాలి మండలం ఎత్తురాళ్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన సింగ్ పవార్(60), విజయ్ సింగ్ తోమర్(65), కుసాల్ సింగ్(62), సంతోషి భాయ్(62)గా గుర్తించారు. శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి లారీనీ ఢీ కొట్టింది. వెంటనే రోడ్డుపై ఆగివున్న ఈ బస్సును మరో లారీ వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications