వైన్‌షాపులో దోపిడీ దొంగల భీభత్సం: కత్తులతో దాడి, ఒకరి మృతి
నెల్లూరు: నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగర శివారులోని అయ్యప్పగుడి సెంటర్ సమీపంలోని చింతాలమ్మ వైన్స్ షాపులో సోమవారం తెల్లవారుజామున దుండగులు దోపిడీకి యత్నించారు. దోపిడీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్ చంద్రయ్య, అతనికి సహాయంగా ఉన్న దేవినేని శ్రీనివాసులపై దొంగలు కత్తులు, రాడ్లతో దాడి చేశారు.
ఈ ఘటనలో గుంటూరుకు చెందిన శ్రీనివాస్ మృతి చెందగా, వాచ్‌మెన్ చంద్ర తీవ్రంగా గాయపడ్డారు. దోపిడీకి పాల్పడేకంటే ముందు షాపులోని నగదును క్యాషీయర్ తీసుకెళ్లడంతో.. దొంగలు మిగిలిన సొమ్మును, మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.

ప్రస్తుతం వాచ్‌మెన్ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐదో నగర సిఐ రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండుగులు హిందీలో మాట్లాడారని బాధితుడు తెలపడంతో.. వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా అనుమానిస్తున్నారు.
కాగా, వాచ్‌మెన్ చంద్రయ్యకు సాయంగా ఉండేందుకు వచ్చి శ్రీనివాస్ ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గతంలోనూ ఇటువంటి ఘటనలే చోటు చేసుకోవడంతో పాత నేరస్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నెల్లూరులో పెరిగిపోతున్న దోపిడీల పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ బావిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. కుటుంబ కలహాల కారణంగానే వారు ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications