ఇంటెల్ హైస్కూల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు
అమరావతిః పాఠశాలకు వెళుతున్న ఆటోను బస్సు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జ్ కమిషనర్ జి. శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా వేమవరానికి చెందిన విద్యార్థులు ఉదయం 7 గంటల సమయంలో పేరేచర్లలోని ఇంటెల్ హైస్కూల్ కు ఆటోలో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరులోని లలితా హాస్పిటల్ కు తరలించారు.
ఈ సమాచారం అందిన వెంటనే ఇన్చార్జ్ కమిషనర్ జి. శ్రీనివాస్ హుటాహుటిన బయలుదేరి హాస్పిటల్ కు వెళ్లి గాయాలై చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.

ప్రమాదం ఎలా జరిగిందో అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని డీఈవోకు సూచించారు. పేరేచర్ల ఇంటెల్ హైస్కూల్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం 7 గంటలకే విద్యార్థులను రమ్మనడమేమిటని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైస్కూల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో పాటు ఈ విషయంపై వివరణ ఇవ్వాలని జి. శ్రీనివాస్ ఆదేశించారు. అనంతరం నరసరావు పేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications