చంద్రబాబుకు విలాసాల మీదే శ్రద్ధ, బుద్ధి చెప్తారు: రోజా వ్యాఖ్యలు
చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని రోజా విమర్శించారు. తుందుర్రు ఆందోళనకారులతో మాట్లాడేందుకు బాబుకు సమయం దొరకడం లేదని అన్నారు.
నరసాపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా వ్యాఖ్యానించాచరు. ఆక్వా పార్కును సముద్ర తీరానికి తరలించకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.
తుందుర్రు మెగా ఆక్వా పార్కును సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రసాద రాజును ఆమె శనివారంనాడు పరామర్శించారు. ఆయన దీక్ష శనివారంనాటికి రెండో రోజుకు చేరుకుంది.

గన్‌మెన్ లేకుండా మంత్రులు తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమవుతుందని రోజా అన్నారు. మొగల్తూరు ఘటనలో ఐదుగురు మరణిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు .కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారు కాబట్టే యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
తుందుర్రు ఆందోళనకారులతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమయం దొరకడం లేదని ఆమె అన్నారు. ప్రసాదరాజుకు సంఘీభావం తెలిపిన ఆమె మీడియాతో మాట్లాడారు. తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల ముడుపులు తీసుకున్నారని అన్నారు.
కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికను తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు. మహిళలపై లాఠీచార్జ్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. తుందుర్రు ఫ్యాక్టరీని తరలించేంత వరకు ఉద్యమం ఆగదని ఆమె స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications