గాలిపై దుమ్మెత్తిపోసిన రోజా: హెచ్చార్సీకి ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసనసభ్యురాలు, సినీ నటి రోజా మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. నగరిలో తన విజయాన్ని గాలి ముద్దుకృష్ణమ నాయుడు జీర్ణించుకోలేక పోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
నగరి ఎమ్మెల్యేగా తాను విజయం సాధించనప్పటి నుంచి గాలి తననూ తన పార్టీవారిని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. నగరి మున్సిపల్ చైర్ పర్సన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శాంతకుమారి కుటుంబ సభ్యులపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆమె మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కి మంగళవారంనాడు ఫిర్యాదు చేశారు.

శాంతకుమారితో కలిసి ఆమె హెచ్చార్సి కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రోజా మీడియాతో మాట్లాడారు. పోలీసులు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంటి గేట్లు పగులగొట్టి ఆమె కుటుంబ సభ్యులను లాక్కుపోయారని రోజా ఆరోపించారు.
అడ్డుకున్న మహిళలను బూతులు తిట్టారని ఆమె అన్నారు. శాంతకుమారి కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేసిన సిఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్ఆర్సీని కోరారు. ఈ కేసు విచారణను హెచ్ఆర్సీ సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications