పార్టీలో రోజాకు వరుస షాక్ లు -నేతల బేఖాతర్ : నియోజకవర్గంలో ఎదురుదెబ్బ- కొత్త టెన్షన్ ..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. వరుసగా రెండో సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నామినేటెడ్ పదవి లో నిన్న మొన్నటి వరకు ఉన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రి గా ఛాన్స్ వస్తుందంటూ రోజా అనుచరులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అయితే, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాటి సీఎం చంద్రబాబును ఎదిరించి పార్టీ కోసం నిలబడ్డారు. ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇక, రెండో సారి గెలవటం..పార్టీ అధికారంలో రావటం జరిగిన తరువాతనే రోజా సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నారు.

నగరిలో రోజాకు వ్యతిరేకంగా
మంత్రి పదవి రాకపోయినా..సీఎం జగన్ పార్టీకి రోజా సేవలను గుర్తించి నామినేటెడ్ పదవి కేటాయించారు. కొద్ది రోజుల క్రితం పార్టీ నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఎమ్మెల్యేలకు జోడు పదవులు వద్దనే నిర్ణయంతో ఆ పదవిని రోజా వదులు కోవాల్సి వచ్చింది. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గతం కంటే భిన్నంగా రోజా వ్యవహరిస్తున్నారు. నాటి ఫైర్ అధికారంలో ఉన్న సమయంలో అవసరం లేకపోవటంతో కామ్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ, పార్టీలో మాత్రం అంతర్గతంగా రోజా కు వ్యతిరేకంగా కొందరు పావులు కదుపుతున్నారు.

రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా
గతంలో తనకు సమాచారం లేకుండా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన నియోజకవర్గంలో పర్యటించటం పైన ఫైర్ అయ్యారు. జిల్లా అధికారులు సైతం తనకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదంటూ తిరుపతి లో జరిగిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీలో రోజా కన్నీటి పర్యంతమయ్యారు. అదే విధంగా కొందరు తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న విషయాన్ని పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసిన రోజా..వారిని నియంత్రించాలని కోరారు. కానీ, ఇప్పటికీ అది జరగలేదు.

పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా
నియోజకవర్గం లో రోజాకు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్న ఒక నేత ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల విషయంలోనూ ఇబ్బంది పెడుతున్నట్లుగా రోజా మద్దతు దారులు చెబుతున్నారు. మున్సిపల్ - పంచాయితీ ఎన్నికల్లో రోజా నియోజకవర్గం నగరిలో పార్టీ అన్నింటా గెలిచింది. ఇక, నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర మండలంలో ఎంపీపీ ఎన్నిక ఇప్పుడు రోజాకు సవాల్ గా మారింది. అత్యధిక ఎంపీపీలు వైసీపీ గెలుచుకున్నా ఎమ్మెల్యే మాటకు భిన్నంగా మరొకరు మండల పదవి దక్కించుకొనే ప్రయత్నం సాగుతోంద. దీనికి రోజా వ్యతిరేక శిబిరంలోని నేతలు మద్దతిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఎంపీపీ ఎన్నికలో రోజా మాట డోంట్ కేర్
నిండ్ర మండలంలోని 8 ఎంపీటీసీ స్థానాలకు గానూ 7 వైసీపీ, ఒకటి టీడీపీ దక్కించుకున్నాయి. వైసీపీలోనూ ఎమ్మెల్యే రోజా వర్గంలో ఇద్దరుండగా, వైసీపీ జిల్లా కార్యదర్శి భాస్కర్‌రెడ్డి వర్గంలో ఐదుగురు ఉన్నారు. ఎంపీపీ ఎన్నికలో భాగంగా శుక్రవారం ఇరువర్గాల నుంచి రెండు చొప్పున మొత్తం నాలుగు దరఖాస్తులు కోఆప్షన్ సభ్యుడి కోసం ఆర్వో భాస్కరయ్యకు అందించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన అనిల్‌కుమార్ దరఖాస్తు మినహా మూడింటిని ఆర్వో తిరస్కరించారు. దీంతో భాస్కర్‌రెడ్డి సహా ఆయన వర్గానికి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక సమావేశానికి హాజరుకాలేదు.

ఎమ్మెల్యే మాట కాదని సొంతంగా పోటీలో
టీడీపీ ఏకైక ఎంపీటీసీ విజేష్, రోజా వర్గానికి మద్దతు ఇచ్చినా.. ముగ్గురే అయ్యారు. ఐదుగురు ఎంపీటీసీలుంటేనే ఎంపీపీ ఎన్నిక పూర్తవుతుంది.కాసేపటి తర్వాత మళ్లీ వచ్చిన భాస్కర్‌రెడ్డి వర్గం.. అధికారులు ఉద్దేశపూర్వకంగా తమ దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపించారు. ఆర్వోను మార్చితేనే ఎన్నికలో పాల్గొంటామని చెప్పారు. దీంతో నిండ్రలో ఎంపీపీ ఎన్నిక ఆగిపోయింది. దీంతో..రోజా నేరుగా రంగ ప్రవేశం చేసారు. ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా..స్థానిక నేతలు ఈ రకంగా వ్యవహరించటం సరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

రోజా పెత్తనం అక్కడ సాగటం లేదా
కానీ, స్థానిక నేతలు మాత్రం మందుగా తాము తీసుకున్న నిర్ణయానికే కట్టుబడినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో..రోజా మద్దతు దారులు వర్సెస్ వ్యతిరేక వర్గం అన్నట్లుగా పరిస్థితి మారింది. దీని ద్వారా..నియోజకవర్గంలో రోజా తన పట్టు కోల్పోతున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. రోజా ఫిర్యాదు చేసినా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి పైన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు..దీని వెనుక ఎవరున్నారనే ఆసక్తి కర చర్చ ఇప్పుడు పార్టీలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications