సేమ్ కామెంట్స్: పవన్ కల్యాణ్ చేస్తే అలా, రోజా చేస్తే...?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులపై గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలనే తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా చేశారు. రాష్ట్రానికి చెందిన ఎంపిలు ప్రత్యేక హోదా తదితర హామీలను సాధించడం కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడకుండా తమ వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని పవన్ కల్యాణ్ గతంలో విమర్శించారు.
ఒకవేళ వారికి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే ఆసక్తి లేకపోతే తక్షణమే వారందరూ తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకొంటే వారి స్థానంలో సమర్దులయిన వారిని ఎన్నుకొంటామని కూడా ఘాటుగా అన్నారు. దాంతో టిడిపి పార్లమెంటు సభ్యులు తోక తొక్కిన తాచులా లేచి పవన్ కల్యాణ్‌పై బుసకొట్టారు.
పవన్ కల్యాణ్‌పై వారుంతా మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. అయితే, టిడిపి అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించడంతో నోళ్లకు కుట్లు వేసుకున్నారు. అప్పుడు టిడిపి ఎంపిలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలనే వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా మళ్ళీ ఆదివారంనాడు చేశారు.

విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చి టిడిపి, బిజెపి ఎంపిలను దద్దమలుగా అభివర్ణించారు.
వారికి వ్యాపారాల మీద ఉన్నంత శ్రద్ధ రైల్వే జోన్ సాధించడంపై లేదని, అందుకే రెండేళ్ళవుతున్నా కేంద్రప్రభుత్వం ఆ హామీని పట్టించుకోవడంలేదని రోజా అన్నారు. రైల్వే జోన్ అంటే అదేదో విశాఖ నగరానికి సంబంధించిన విషయం కాదని, మొత్తం రాష్ట్రానికి సంబంధించిందని ఆమె అన్నారు.
టిడిపి, బిజెపి ఎంపిలు దాని గురించి కేంద్రప్రభుత్వాన్ని పార్లమెంటులో గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. వారికి తమ వ్యాపారాలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం తప్ప ప్రజలు, రాష్ట్రం కాదు. అటువంటివారికి ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెపుతారని కూడా రోజా అన్నారు.
పవన్ కల్యాణ్ టిడిపి, బిజెపిలకు మిత్రుడు కాబట్టి తొలుత విమర్శలు చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. మరి, రోజా చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. అసలు రోజా వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టిడిపి పార్లమెంటు సభ్యులు భావిస్తున్నారా, చెప్పలేం.












Click it and Unblock the Notifications